రూ.23.85 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..
రాష్ట్రంలోనే నల్గొండను ఆదర్శంగా నిలబెట్టడమే ధ్యేయం..
నల్గొండ : నల్గొండ పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైన్లు, సెంట్రల్ లైటింగ్, తాగునీరు, విద్యుత్, పార్కులు వంటి అన్ని సదుపాయాలను కల్పించి సమస్యలు లేని పట్టణంగా, తెలంగాణలోనే నంబర్ వన్ మున్సిపల్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో రూ.23.85 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, భూమి పూజలు నిర్వహించారు. ముందుగా 3వ డివిజన్‌లో షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ కాలనీ నుంచి శేషమ్మ గూడెం మీదుగా అద్దంకి రహదారి వరకు రూ.9.40 కోట్లతో నిర్మించనున్న హైలెవెల్ బ్రిడ్జి, రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పానగల్ సమీపంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం నుంచి డీఈఓ కార్యాలయం వరకు 3 కిలోమీటర్ల మేర వన్ టైమ్ ఇంప్రూవ్‌మెంట్ కింద రూ.14.45 కోట్లతో చేపట్టనున్న రోడ్డు పనులకు భూమి పూజ చేశారు.
వేగంగా పట్టణాభివృద్ధి పనులు..
ఈ సందర్భంగా ఆయా డివిజన్లలో మంత్రి మాట్లాడుతూ.. నల్గొండ పట్టణాభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పట్టణం వెలుపల రూ.900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు, పట్టణంలో రూ.500 కోట్లతో చేపట్టిన సీసీ రహదారులు, డ్రైన్ల పనులు శరవేగంగా పురోగతిలో ఉన్నాయన్నారు. పట్టణ ప్రజలకు 24 గంటల తాగునీరు అందించేందుకు ఇటీవల ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి రూ.83 కోట్లతో వాటర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారని నెల రోజుల్లో దీని ద్వారా నీరందించే పనులు పూర్తవుతాయని వెల్లడించారు. తాగునీటి అవసరాల కోసం సీఎంతో మాట్లాడి మరో రూ.300 కోట్లు తీసుకొచ్చినట్లు తెలిపారు. రూ.125 కోట్లతో నిర్మిస్తున్న 12 తాగునీటి ట్యాంకుల్లో ఒకటి పూర్తి కాగా, మిగతా 11 డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు.
మౌలిక సదుపాయాలు, పర్యాటకాభివృద్ధి..
పట్టణంలో విద్యుత్ సమస్యల్లేకుండా శివారు ప్రాంతాల్లోనూ రూ.3 కోట్లతో సబ్‌స్టేషన్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. మొదటి విడతలో 700 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, ఈ నెల 15న గొల్లగూడ వద్ద నిర్మించిన 552 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పక్షపాతం లేకుండా లబ్ధిదారులకు అందించామన్నారు. లతీఫ్ సాబ్ గుట్ట, శివాలయం గుట్టలకు రూ.150 కోట్లతో రహదారుల నిర్మాణం, రోప్‌వే ఏర్పాటు పనులు నడుస్తున్నాయని చెప్పారు. ఛాయా సోమేశ్వరాలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రూ.150 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామన్నారు. ఎన్జీ కళాశాలను మోడల్ కళాశాలగా తీర్చిదిద్దేందుకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మహిళా స్వయం సహాయక సంఘాల ప్రోత్సాహానికి రూ.3 కోట్లతో పెట్రోల్ పంప్, రూ.2 కోట్లతో సూపర్ మార్కెట్ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పనతో పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలకతీతంగా మంత్రి అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆమీర్ అలీ, మున్సిపల్ కమిషనర్ వంశీ, ఆర్అండ్‌బీ ఎస్ఈ పున్నమోహన్, ఈఈ శ్రీధర్ రెడ్డి, ఆర్డీఓ అశోక్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి