బ్యాంకుల వద్ద ‘దృష్టి మల్లించి’ డబ్బును కొట్టేసే ముఠా అరెస్ట్!
బ్యాంకుల వద్ద ‘దృష్టి మల్లించి’ డబ్బును కొట్టేసే ముఠా అరెస్ట్!
NM Yadav
కేవలం 24 గంటల్లోనే ఛేదించిన నల్లగొండ పోలీసులు..
రూ.2.20 లక్షల నగదు ద్విచక్ర వాహనం స్వాధీనం..
నిందితుల్లో ఒకరు మైనర్..
నల్గొండ : బ్యాంకుల వద్ద అమాయక ప్రజలే లక్ష్యంగా రకరకాల ట్రిక్స్‌తో దృష్టి మళ్లించి రూ.లక్షల్లో నగదు అపహరిస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టును నల్లగొండ పోలీసులు రట్టు చేశారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2.20 లక్షల నగదు, ఒక బైక్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. శనివారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కె.శివరాం రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో దొంగతనాల అదుపునకు పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 19న తిప్పర్తికి చెందిన గాదె లింగయ్య అనే రైతు తన వరి ధాన్యాల విక్రయం ద్వారా వచ్చిన రూ.1,50,000/- నగదును నల్లగొండ క్లాక్ టవర్ సమీపంలోని యూనియన్ బ్యాంక్ నుండి డ్రా చేశాడు. ఆ సొమ్మును ఒక కవర్‌లో పెట్టి, తన బైక్ ట్యాంక్ కవర్‌లో దాచాడు. ఆయన గ్రామానికి వెళ్లేందుకు బైక్ తీస్తుండగా.. నిందితులు తమ మోటార్ సైకిల్‌ను అడ్డం పెట్టారు. మాటల్లో దించి, రైతు దృష్టి మరల్చి ట్యాంక్ కవర్‌లోని రూ.1.50 లక్షల నగదుతో క్షణాల్లో పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో నల్లగొండ 1 టౌన్ పోలీసులు కేసు (Cr. No. 128/2026) నమోదు చేశారు.
24 గంటల్లోనే దొంగల ముఠా ను పట్టుకున్న పోలీసులు..
ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన నల్లగొండ డీఎస్పీ కె.శివరాం రెడ్డి నేతృత్వంలో 1 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బ్యాంకు పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలు, నిందితుల ఫోటోలు, వాహన వివరాల ఆధారంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమములోనే తేదీ 21.05.2026న నక్రేకల్ పట్టణంలోని ఎస్‌బీఐ బ్యాంకు వద్ద మరో రైతు నుంచి ఇదే తరహాలో రూ.1,40,000/- దోచుకుని ఈ ముఠా పారిపోతుండగా.. అదే రోజు సాయంత్రం 4 గంటల సమయంలో సీఐ రాజా శేఖర్ రెడ్డి, ఎస్సైలు సైదులు, సైదాబాబు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా హెచ్ఎఫ్ డీలక్స్ బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది.
నిందితుల వివరాలు...A-1) రాహుల్ (ప్రస్తుతం పరారీలో ఉన్నాడు), A-2) కేశవ తేజ దొక్వల (20), తండ్రి, తేజు @ కృష్ణప్ప, వృత్తి: కూలీ. నివాసం బీజాపూర్ నాకా, సోలాపూర్, మహారాష్ట్ర, 3) జేసీఎల్ (JCL): 13 ఏళ్ల మైనర్ బాలుడు, విరందరు ముఠా గా ఏర్పడి తక్కువ రోజుల్లో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే తాము ఈ దొంగతనాలకు అలవాటు పడ్డామని నిందితులు ఒప్పుకున్నారు. గతంలో మక్తల్, మరికల్, నల్లగొండ 1 టౌన్, ఖమ్మం త్రీ టౌన్, నక్రేకల్ పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ తామే దొంగతనాలు చేసినట్లు అంగీకరించారు. నిందితుల నుంచి రూ.2.20 లక్షల నగదు, దొంగతనాలకు వాడిన హెచ్ఎఫ్ డీలక్స్ బైక్, వీవో సెల్ ఫోన్, బ్యాంక్ పాస్ బుక్‌లు, దృష్టి మరల్చడానికి వాడే సామాగ్రిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
ఈ ముఠా దొంగతనాలకు వాడే ట్రిక్స్..
బ్యాంకు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ శివరాం రెడ్డి సూచించారు. ఈ అంతరాష్ట్ర ముఠా అనుసరించే పద్ధతులను ఆయన వివరించారు, బ్యాంకుల లోపల, వెలుపల రద్దీగా ఉండే సమయాల్లో నిఘా ఉంచుతారు పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేసే వారిని వెంబడిస్తారు. బాధితుడు బ్యాంకు బయటకు రాగానే బైక్‌ను అడ్డం పెట్టడం, కింద నోట్లు పడిపోయాయని చెప్పడం, ఇంజన్ ఆయిల్ కారుతోందని నమ్మించడం చేస్తారు. కొన్నిసార్లు బట్టలపై మురికి లేదా దురద వచ్చే పౌడర్ చల్లి.. బాధితుడు కడుక్కునే లోపు నగదుతో పారిపోతారు. బ్యాంకుల్లో నగదు విత్‌డ్రా లేదా డిపాజిట్ చేసేటప్పుడు ఒంటరిగా వెళ్లకుండా ఎవరినైనా తోడు తీసుకెళ్లాలి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 'డైల్ 100' లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
పోలీస్ సిబ్బందికి అభినందనలు..
సవాలుతో కూడిన ఈ కేసును కేవలం 24 గంటల్లోనే ఛేదించి, నిందితులను పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించిన సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్సైలు సైదులు, సైదాబాబు, సిబ్బంది రబ్బాని, రాజు, శంకర్, అజ్మత్, అంజయ్య, కిరణ్, ఆంజనేయులను జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి