విజయవాడలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం 510 కిలోమీటర్ల సైకిల్ యాత్ర
విజయవాడలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం 510 కిలోమీటర్ల సైకిల్ యాత్ర
GADDAM JAGANMOHAN REDDY
డ్రగ్స్ మహమ్మారిని సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో విజయవాడ నగర పోలీసు విభాగం చేపట్టిన 510 కిలోమీటర్ల “డ్రగ్స్‌పై దండయాత్ర” 34 రోజుల అనంతరం ఘనంగా ముగిసింది. నగర పోలీసు కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు నేతృత్వంలో, అడ్మిన్ డి.సి.పి కె.జి.వి. సరిత స్వీయ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ యాత్ర సి.ఏ.ఆర్ గ్రౌండ్‌లో విజియోత్సవ ర్యాలీతో ముగిసింది.
ఇబ్రహింపట్నం నుంచి తెల్లవారు జామున బయలుదేరిన యాత్ర బందర్ రోడ్డులోని పాత పోలీసు కంట్రోల్ రూమ్‌కు చేరుకుంది. అక్కడ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు, ఈగల్ ఐ.జి ఆకే రవికృష్ణ, డి.సి.పిలు కృష్ణ కాంత్ పటేల్, షిరీన్ బేగం, కె.జి.వి. సరిత, తిరుమలేశ్వర, కృష్ణ ప్రసన్న, ఏ.బి.టి.ఎస్. ఉదయారాణి, బి. లక్ష్మీనారాయణ, ఈగల్ ఎస్.పి నగేష్ తదితరులు పాల్గొని యాత్రకు స్వాగతం పలికారు.
అక్కడి నుంచి సుమారు 500 మంది విద్యార్థులు, పోలీసు అధికారులు సైకిళ్లపై ఇంద్రాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న ఏ.ఆర్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. ముగింపు సభలో 34 రోజుల పాటు యాత్రను పూర్తి చేసిన ఐదుగురు మహిళా పోలీసు సైకిలిస్టులను సత్కరించారు.
“ఇది అంతం కాదు... ఆరంభం మాత్రమే”
ఈ సందర్భంగా కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు మాట్లాడుతూ డ్రగ్స్‌ను అధఃపాతాళానికి తొక్కడమే ఈ యాత్ర లక్ష్యమని పేర్కొన్నారు. “ఇది ప్రజల ఆకాంక్ష నుంచి పుట్టిన యాత్ర. ఒక తల్లి కడుపుకోత నుంచి వచ్చిన ఉద్యమం. యువత భవిష్యత్తుపై రాసిన సంతకం” అని అన్నారు.
డ్రగ్స్ కేసుల్లో 25 మందిపై పిట్ ఎన్.డి.పి.ఎస్ చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. యాత్రలో భాగంగా 2513 మంది డ్రగ్స్ బానిసలను గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కౌన్సిలింగ్, అవసరమైన చికిత్స అందించామని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 149 హాట్‌స్పాట్‌లను గుర్తించి సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేపట్టినట్లు వివరించారు. కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించామని చెప్పారు.
యాత్ర విజయవంతానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, ఈగల్ అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు.
దేశంలోనే వినూత్న కార్యక్రమం
ఈగల్ ఐ.జి ఆకే రవికృష్ణ మాట్లాడుతూ 34 రోజులపాటు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం పోలీసు విభాగానికి గర్వకారణమని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డ్రగ్స్‌పై సైకిల్ యాత్ర నిర్వహించామని తెలిపారు.
అడ్మిన్ డి.సి.పి కె.జి.వి. సరిత మాట్లాడుతూ కమిషనర్ కథా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో 510 కిలోమీటర్ల యాత్ర విజయవంతంగా పూర్తి కావడం సంతోషకరమన్నారు. జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రజలు డప్పులు, నృత్యాలతో స్వాగతం పలికి మద్దతు తెలిపారని తెలిపారు.
ఈ ముగింపు కార్యక్రమంలో సుమారు 2000 మంది వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక పోరాటానికి సంఘీభావం తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి