ప్రజలపై భారాలు మోపిన మోదీ క్షమాపణ చెప్పాలి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం..
ప్రజలపై భారాలు మోపిన మోదీ క్షమాపణ చెప్పాలి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం..
NM Yadav
రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానాలు అమలు చేయకుంటే ప్రజాాగ్రహం తప్పదు..
నల్లగొండ గడియారం సెంటర్‌లో సిపిఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా..
నల్లగొండ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ధరలను విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపిందని ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని సిపిఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఇంధన, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జిల్లా సమితి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, రైతులు, కార్మికులు మండుటెండను సైతం లెక్కచేయకుండా భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఎన్నికలు ముగియగానే బాదుడే బాదుడు..
ధర్నాను ఉద్దేశించి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి, సామాన్యుడి జీవనం దుర్భరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు దేశంలో గ్యాస్ నిలువలు పుష్కలంగా ఉన్నాయని, రేట్లు పెంచే ఆలోచనే లేదని నమ్మబలికిన ప్రధాని మోదీ.. ఎన్నికలు ముగియగానే కేవలం నెల రోజుల వ్యవధిలోనే మూడుసార్లు ధరలు పెంచడం దుర్మార్గం. ఈ విధానాల వల్ల ధనవంతులు మరింత ధనవంతులుగా పేదలు మరింత పేదవారిగా మారుతున్నారు.
రైతు భరోసాను పరిమితం చేయడం సరికాదు..
రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం సైతం ఆరు గ్యారంటీల అమలులో జాప్యం చేస్తోందని నెల్లికంటి సత్యం విమర్శించారు. రైతు భరోసాను కేవలం రెండు ఎకరాలకే పరిమితం చేయాలని చూడటం సరికాదన్నారు. సాగు చేస్తున్న ప్రతి రైతుకూ పెట్టుబడి సాయం అందేలా చూడాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల లబ్ధి పారదర్శకంగా అందరికీ అందాలని, పక్షపాత ధోరణి అవలంబిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికీ పడుతుందని హెచ్చరించారు.
ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీపై జాప్యం వద్దు..
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ఎల్-1, ఎల్-2ల పేరుతో కాలయాపన చేయడం తగదన్నారు. అర్హులైన వారందరికీ ఇండ్లు మంజూరు చేసి, నిధులు తక్షణమే విడుదల చేయాలన్నారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీకి దూరమైన రైతులందరికీ రూ. 2 లక్షల వరకు రుణమాఫీ వర్తింపజేయాలని కోరారు. ధర్నా సందర్భంగా ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు బి. జగన్, జిల్లా కార్యదర్శి చెల్లం పాండురంగారావు నేతృత్వంలోని కళాకారుల బృందం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ఆలపించిన చైతన్య గీతాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, సీనియర్ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, లోడంగి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, బొల్గూరి నర్సింహా, బంటు వెంకటేశ్వర్లు, గురిజ రామచంద్రం, ఆర్. అంజచారి, టి. వెంకటేశ్వర్లు, నల్పరాజు రామలింగయ్య, తూము బుచ్చిరెడ్డి, పట్టణ కార్యదర్శి కర్ర సైదిరెడ్డి మరియు వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి