జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
NM Yadav
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..
నిలిచిపోయిన పనులకు తక్షణమే పరిహారం చెల్లించి, ప్రారంభించాలి..
పంట మార్పిడిపై రైతుల్లో అవగాహన కల్పించాలి..
జిల్లా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షలో వెల్లడి...
నల్గొండ : నీటిపారుదల, రహదారులు, వ్యవసాయంతో పాటు అన్ని రంగాలలో నల్గొండ జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ప్రస్తుత ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని ఆయన తెలిపారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, ధాన్యం సేకరణ తదితర కీలక అంశాలపై మంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
సాగునీటి ప్రాజెక్టుల పూర్తికే ప్రాధాన్యం..
జిల్లాలోని ప్రతి ఎకరాకూ సాగునీరు అందించి నల్గొండను సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఏఎంఆర్‌పీ కాలువల లైనింగ్, బ్రాహ్మణ వెళ్లెముల, ఎస్ఎల్‌బీసీ సొరంగం వంటి ప్రతిష్టాత్మక పనులను వేగవంతం చేసినట్లు వివరించారు. బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు కింద పెండింగ్‌లో ఉన్న మైనర్, సబ్ మైనర్ కాలువల పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులతో ఆరా తీశారు.
అక్కడికక్కడే కలెక్టర్‌కు ఆదేశాలు..
నార్కెట్‌పల్లి మండలం కొండపాకోనిగూడెంలో ఒక రైతు భూమి వివాదం కారణంగా 40 మీటర్ల మేర కాలువ పనులు నిలిచిపోయిన విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై మంత్రి తక్షణమే స్పందిస్తూ జిల్లా కలెక్టర్ నిధుల నుంచి సదరు రైతుకు నష్టపరిహారం మంజూరు చేసి ఆగిపోయిన పనులను వెంటనే పునఃప్రారంభించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కొండపాకోనిగూడెం చెరువు నిండితేనే దోమలపల్లి చెరువుతో పాటు మండలంలోని ఇతర చెరువులు నిండుతాయని తద్వారా అన్ని గ్రామాలకు సాగునీరు అందుతుందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ధాన్యం సేకరణలో నల్గొండ టాప్ కానీ పంట మార్పిడి అవసరం..
రాష్ట్రంలోనే ధాన్యం సేకరణలో నల్గొండ జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం పట్ల జిల్లా కలెక్టర్‌ను మంత్రి అభినందించారు. జిల్లాలో ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చిందని, అయితే రైతులు ప్రతి సీజన్‌లో వరినే నమ్ముకోకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పంట మార్పిడి విధానంపై వ్యవసాయ అధికారులతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాలు కూడా రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఆర్ అండ్ బి రహదారుల సమీక్షలో భాగంగా నార్కెట్‌పల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB) పనులను తక్షణమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి బాధితులకు చెల్లింపులు జరిపి పీఎన్ (ప్రాథమిక నోటిఫికేషన్) జారీ చేయాలన్నారు. పనుల్లో జాప్యం జరగకుండా కలెక్టర్ వద్ద అందుబాటులో ఉన్న నిధులను వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ఈ శ్రీధర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్ రెడ్డి, ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పిచ్చయ్య, పౌర సరఫరాల డీఎం రామ్‌పతి నాయక్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి