ప్రభుత్వ పథకాల్లో ప్రజలు భాగస్వాములు కావాలి గుత్తా సుఖేందర్ రెడ్డి..
ప్రభుత్వ పథకాల్లో ప్రజలు భాగస్వాములు కావాలి గుత్తా సుఖేందర్ రెడ్డి..
NM Yadav
వివిధ రంగాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి..
జూన్ 2 నాటికి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి అధికారులకు ఆదేశం..
ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ’ జిల్లాస్థాయి సదస్సు..
నల్లగొండ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల విజయవంతంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యచరణలో భాగంగా బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని బైపాస్ రోడ్డు వద్ద గల ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం రైతు బీమా, రైతు భరోసా, 6 గ్యారంటీల వంటి అనేక పథకాలను అమలు చేస్తోందని గుత్తా తెలిపారు. అయితే, వివిధ రంగాల్లో ఇంకా కొన్ని సమస్యలు నెలకొన్నాయని, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
పంటల మార్పిడిపై రైతులు అవగాహన పెంచుకోవాలి..
దేశ, కాల, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటల మార్పిడి విధానాన్ని అవలంబించాలని, దీనిపై అవగాహన పెంపొందించుకోవాలని శాసనమండలి చైర్మన్ సూచించారు. రోజురోజుకూ తగ్గిపోతున్న పశు సంపదను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యలు ఉత్పన్నం కావడానికి మనమే కారణం కావద్దని వాటి పరిష్కారంపై అధికారులు, ప్రజాప్రతినిధులు లోతుగా ఆలోచించాలన్నారు. విద్య, వైద్యం, సాగునీటి రంగాల్లోని సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి జరగాలన్నారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల (మెడికల్ కాలేజీ) ఏర్పాటు చేసినప్పటికీ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడంపై గుత్తా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూళ్ల ఏర్పాటుతో పాటు ఉచిత యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, రానున్న విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) కూడా అందించనున్నట్లు వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తున్నామని, రాబోయే జూన్ 2వ తేదీ నాటికి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పూర్తిగా ముగించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేకంగా ట్రాక్టర్లను ఏర్పాటు చేసి, తడి చెత్త - పొడి చెత్త సేకరిస్తున్నామని గుర్తుచేశారు.
త్వరలో 'కుటుంబ జీవిత బీమా పథకం' మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి..
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక అనేది ప్రజల కోసమే అంకితమైన ఒక అద్భుతమైన కార్యక్రమమని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్న నూతన పథకం 'కుటుంబ జీవిత బీమా పథకం' వివరాలను ఈ సందర్భంగా ఆమె సభకు వివరించారు.
సంక్షేమ పథకాల్లో అధికారుల పాత్ర కీలకం ఎమ్మెల్సీ సత్యం..
ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రజలకు చేర్చడంలో అధికారుల పాత్ర అత్యంత కీలకమని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలను అమలు చేస్తున్నప్పటికీ ఇంకా కొన్ని సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయని, వాటిపై కూడా ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కోరారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మార్చి 6వ తేదీన ప్రారంభమైన 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' ద్వారా సాధించిన విజయాలను, జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరంగా ప్రదర్శించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, రోడ్డు భద్రతకు సంబంధించి తాము తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను, 'అలైవ్ (ALIVE)', 'అరైవ్ (ARRIVE)' కార్యక్రమాల పురోగతిని సభకు వివరించారు. అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులు వారి వారి శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను పీపీటీల ద్వారా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సదస్సులో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, వివిధ మున్సిపాలిటీల చైర్మన్లు, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి