నల్గొండను 'సూపర్ సిటీ'గా తీర్చిదిద్దుతా.!
నల్గొండను 'సూపర్ సిటీ'గా తీర్చిదిద్దుతా.!
NM Yadav
65 కోట్లతో నిర్మించిన మర్రిగూడ ఫ్లైఓవర్ ప్రారంభం..
ఈనెల రోజుల్లో తాగునీటి పథకానికి మరో ₹290 కోట్లు మంజూరు..
ఆర్ అండ్ బీ శాఖను రాష్ట్రానికే రోల్ మోడల్‌గా నిలుపుతా రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి..
నల్గొండ : నల్గొండ పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసి ‘సూపర్ సిటీ’గా రూపుదిద్దుతానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ తరహాలోనే నల్గొండలోనూ మౌలిక వసతులు, రహదారుల విస్తరణ వేగవంతంగా జరుగుతుందని తెలిపారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ జంక్షన్ వద్ద నామ్ రోడ్డుపై రూ.65 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
అహ్లాదకరంగా మర్రిగూడ జంక్షన్..
మర్రిగూడ ఫ్లైఓవర్ జంక్షన్‌ను హైదరాబాద్‌లోని ప్రధాన వంతెనల మాదిరిగా అందమైన పెయింటింగ్స్, ఆర్ట్స్, ప్రముఖుల చిత్రాలతో మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేలా తీర్చిదిద్దినట్లు మంత్రి చెప్పారు. వాహనదారులకు సులభంగా అర్థమయ్యేలా సూచిక (ఇండికేటర్) బోర్డులతో పాటు పేర్లతో కూడిన నేమ్‌బోర్డులను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగి, రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
రూ.750 కోట్లతో ఓఆర్ఆర్, రూ.300 కోట్లతో గ్రామీణ రోడ్లు..
నల్గొండ పట్టణంలో కాలుష్యం తగ్గించడంతో పాటు ప్రమాదాల నివారణకు ఇప్పటికే రూ.750 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు (ORR) మంజూరు చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. చర్లపల్లి, మర్రిగూడెంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో మట్టి రోడ్లు లేకుండా, అన్నింటినీ సీసీ రోడ్లు, డ్రైన్లుగా మార్చేందుకు రూ.300 కోట్లతో ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి సమర్పించినట్లు వెల్లడించారు. త్వరలోనే రైల్వే ట్రాక్ వద్ద కూడా మరో ఫ్లైఓవర్ రానుందన్నారు. రోడ్ల విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించి ఆదుకుందని స్పష్టం చేశారు.
తాగునీరు, విద్యుత్ వసతులు..
పట్టణంలో ఇటీవలే సమగ్ర తాగునీటి పథకానికి సీఎం శంకుస్థాపన చేశారని, ఈ పథకానికి అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.290 కోట్లు మంజూరు కానున్నాయని నెల రోజుల్లో అనుమతులు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ వెల్లెముల వద్ద మినీ ట్యాంక్‌బండ్ అభివృద్ధి, బక్కతాయికుంట పైభాగంలో రూ.7 కోట్లతో చెరువు పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. పట్టణ విద్యుత్ అవసరాల కోసం అదనపు సబ్‌స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. నల్గొండ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.
ఆర్ అండ్ బీ శాఖ రోల్ మోడల్..
రాష్ట్రవ్యాప్తంగా ఆర్ అండ్ బీ ద్వారా అన్ని ‘హ్యామ్’ (HAM) రోడ్లను నాలుగు లైన్ల డబుల్ రోడ్లుగా మారుస్తున్నామని మంత్రి తెలిపారు. నల్గొండ-దేవరకొండ 4 లైన్ల రోడ్డు నిర్మాణానికి సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయించామని గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి రహదారుల నిర్మాణం చేపట్టి, తెలంగాణ ఆర్ అండ్ బీ శాఖను దేశంలోనే రోల్ మోడల్‌గా నిలుపుతామన్నారు. అభివృద్ధి పనులతో పాటు నిరుపేదలకు విద్య, వైద్య రంగాల్లో 'ప్రతీక్ ఫౌండేషన్' ద్వారా ఎల్లప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, స్థానిక కార్పొరేటర్ పెరిక స్వాతి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జుకురి రమేష్, కార్పొరేటర్లు బొడ్డుపల్లి లక్ష్మి, గుమ్మల జానకి, నాగరాజు పాల్గొన్నారు. అధికారుల తరఫున రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఎస్ఈ పున్నమోహన్, ఈఈ శ్రీధర్ రెడ్డి, డిఈ గణేష్, తహసీల్దార్ పరుశురాం తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి