ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలు వైద్య సౌకర్యం కల్పించాలి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలు వైద్య సౌకర్యం కల్పించాలి
Bandi Kiran Kumar
నాగారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు వైద్య సౌకర్యం కల్పించే విధంగా అప్ గ్రేడ్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి అన్నారు. శనివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నాగారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సౌకర్యాలు సిబ్బంది సమస్యలపై సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలకు అనుగుణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అప్ గ్రేడ్ చేసి అన్ని రకాల వైద్య సేవలు అందించాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న పీ హెచ్ సి లో 12 గంటల వైద్య సేవలను 24 గంటలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు ఖాళీగా ఉండడంతో తిరుమలగిరి పి.హెచ్.సి నుండి వారానికి ఒకసారి డిప్యూటేషన్ మీద వచ్చి పేషెంట్లకు రక్త పరీక్షలు చేయడంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నర్సింగ్ ఆఫీసర్ ల్యాబ్ టెక్నీషియన్ గా అదనపు బాధ్యతలు చూస్తున్నారని తెలిపారు. గత సంవత్సర క్రితం అటెండర్ రిటైర్మెంట్ కావడంతో ప్రస్తుతం ఆ పోస్టు ఖాళీగా ఉందని అన్నారు. పేరుకు ఆపరేషన్ థియేటర్, ప్రసూతి గది ఉన్న వాటికి అనుగుణంగా సిబ్బంది, సౌకర్యాలు లేవని అన్నారు. 24 గంటలు వైద్య సేవలు అందించడం కోసం తగిన సిబ్బందిని నియమించాలని అన్నారు. హాస్పిటల్ కి వచ్చే రోగులకు పనిచేసే సిబ్బందికి టాయిలెట్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పిహెచ్ సి లో పనిచేసే సూపర్వైజర్లు సిబ్బంది మరియు సబ్ సెంటర్లో పనిచేసే వైద్య సిబ్బందితో సమావేశాలు నిర్వహించడం కోసం మీటింగ్ హల్ ఏర్పాటు చేయాలని తెలిపారు. రోగుల వివరాలు మందుల వివరాలు ఇతర సమాచారాన్ని కంప్యూటరీకరణ చేయడం కోసం డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు ఖాళీగా ఉండడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆ బాధ్యత నిర్వహిస్తున్నారని తెలిపారు. నాగారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా అప్ గ్రేడ్ చేసి ప్రజలందరికీ అన్ని రకాల వైద్య సేవలు అక్కడే అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఫార్మసిస్ట్, స్వీపర్లకు గత సంవత్సరం నుండి జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గత అరవపల్లి మండలంలో ఉన్న నాగారం గ్రామ పిహెచ్ సినే మండల పిహెచ్ సిగా మార్చారని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల స్థాయి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తగిన బిల్డింగు నిర్మాణం చేయాలని సిబ్బందికి సరిపడా రూములు మీటింగ్ హాలు టాయిలెట్స్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పస్తాల, డి.కొత్తపెళ్లి, వర్ధమానుకోట పల్లె దవఖానాల్లో ఖాళీగా ఉన్న డాక్టర్ల పోస్టులను వెంటనే నియమించాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పేషంట్లకు సిబ్బందికి సౌకర్యాలు కల్పించి 24 గంటలు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దేవరకొండ యాదగిరి సిపిఎం మండల కమిటీ సభ్యులు కడియం కుమార్, నాయకులు వెంకన్న శ్రీధర్ శివకుమార్ శివకుమార్, శ్రీనివాస్,ఏలేందర్, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి