ఒడిశా నుంచి స్మగ్లింగ్ చేస్తున్న గంజాయి, హాష్ ఆయిల్ ముఠా గుట్టు రట్టు...
ఒడిశా నుంచి స్మగ్లింగ్ చేస్తున్న గంజాయి, హాష్ ఆయిల్ ముఠా గుట్టు రట్టు...
NM Yadav
8 మంది అంతర్రాష్ట్ర నేరస్థుల అరెస్ట్ ఒక మైనర్ అదుపులోకి తీసుకున్న నల్గొండ పోలీసులు..
రూ. 10 లక్షల సొత్తు స్వాధీనం 5.6 కిలోల గంజాయి, 100 ఎంఎల్ హాష్ ఆయిల్, 5 బైక్‌లు, డమ్మీ తుపాకీ రికవరీ..
గంజాయి కొనుగోలుకు బైక్ దొంగతనాలు...
నల్గొండ: గంజాయి, హాష్ ఆయిల్ కొనుగోలు కోసం బైక్ దొంగతనాలకు పాల్పడుతూ, ఒడిశా నుంచి మత్తు పదార్థాలను స్మగ్లింగ్ చేస్తున్న ఒక భారీ అంతర్రాష్ట్ర ముఠా గుట్టును నల్గొండ వన్ టౌన్ పోలీసులు రట్టు చేశారు. ముఠాలోని 8 మంది సభ్యులను అరెస్ట్ చేయడంతో పాటు ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 10 లక్షల విలువైన గంజాయి, వీడ్ ఆయిల్, వాహనాలు మరియు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు నల్గొండ జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ తెలిపారు.
నల్గొండ బైపాస్‌లో దొరికిపోయారు...
ఈ కేసు వివరాలను డీఎస్పీ కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని పోలీస్ బృందం వెల్లడించింది. జులై 24న ఉదయం 11:00 గంటల ప్రాంతంలో నల్గొండ పట్టణంలోని మునుగోడు బైపాస్ రోడ్డు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కొందరు యువకులు గుమిగూడి గంజాయి విక్రయిస్తూ, వినియోగిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. వెంటనే పోలీసులు NDPS యాక్ట్ నిబంధనల ప్రకారం దాడులు నిర్వహించారు. పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించిన 8 మంది నిందితులతో పాటు ఒక మైనర్‌ను చాకచక్యంగా అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్ట్ అయిన నిందితులు... కస్పరాజు నాగరాజు @ కస్పా (20) – డెలివరీ బాయ్, విద్యానగర్, నల్గొండ (A-1), గంటెకంపు మధు @ కిరణ్ (22) – విద్యార్థి, ఖాజీరామారం, తిప్పర్తి (A-2), చెన్నపాక సుశాంక్ @ డెడ్లీ (23) – శ్రీనగర్ కాలనీ, నల్గొండ (A-3), పెండ్ర వాసు @ చింటు (19) కేటరింగ్, మాధవ నగర్, నల్గొండ (A-4), సయ్యద్ షోయబ్ @ షోబి (21) – వెల్డింగ్, ఓల్డ్ సిటీ, నల్గొండ (A-7), గంధం శివమణి (19) – డెకరేషన్ వర్కర్, సూర్యాపేట (A-8),చెరుకు దీపక్ @ పల్లి (19) – చికెన్ షాప్, సూర్యాపేట (A-9), నకిరేకంటి ధరణి కుమార్ @ బబ్లు (19) – డెకరేషన్ వర్కర్, సూర్యాపేట (A-10), ఒక మైనర్ బాలుడు (CCL), పరారీలో ఉన్నవారు.. ఒడిశాకు చెందిన ప్రధాన సరఫరాదారు మనుకర్ (A-5), మహబూబాబాద్‌కు చెందిన హరి (A-6), నల్గొండకు చెందిన ఉదయ్ (A-11), జున్ను (A-12).
నేర మార్గం దొంగతనం చేసిన బైక్‌లతో గంజాయి దందా...
ముఠాలోని ప్రధాన నిందితులైన నాగరాజు (A-1), మధు (A-2) గతంలోనే 15 కేసుల్లో నిందితులుగా ఉండి, తీవ్ర మత్తు వ్యసనానికి బానిసలయ్యారు. త్వరగా డబ్బు సంపాదించాలనే దురాశతో వాసు (A-4), హరి (A-6) లతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు.. జూన్ 29న బైక్‌లపై ఒడిశాలోని పసుపులంక గ్రామానికి వెళ్తూ, మార్గమధ్యలో ఖమ్మం జిల్లా ఏక్నూర్ వద్ద ఒక యాక్టివా బైక్‌ను దొంగిలించారు. ఒడిశాలోని ప్రధాన సరఫరాదారు మనుకర్ (A-5) వద్దకు వెళ్లి, అంతకుముందు హైదరాబాద్‌లో దొంగిలించిన రెండు బైక్‌లను ఇచ్చి.. వాటి బదులుగా రూ.90,000 విలువైన 12 కిలోల గంజాయి, రూ.1,00,000 విలువైన 500 ఎంఎల్ వీడ్ (హాష్) ఆయిల్ కొనుగోలు చేశారు. ఒడిశా నుంచి తెచ్చిన సరుకును తమ అవసరాలకు వాడుకోగా మిగిలిన గంజాయిని నల్గొండకు తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లుగా మార్చారు. కళాశాల విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని అధిక ధరలకు విక్రయించేందుకు ప్రణాళిక వేశారు. గంజాయి దందాను ఎవరైనా అడ్డుకుంటే బెదిరించేందుకు ఒక డమ్మీ తుపాకీని, దాడి చేసేందుకు బటన్ చాకును వెంట ఉంచుకుంటున్నట్లు విచారణలో నిందితులు అంగీకరించారు.
రూ. 10 లక్షల విలువైన సొత్తు స్వాధీనం...
పోలీసులు జరిపిన దాడిలో నిందితుల వద్ద నుంచి మొత్తం రూ. 10 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. 5.6 కిలోల గంజాయి,100 ML వీడ్ (హాష్) ఆయిల్, 5 బైక్‌లు (ఖమ్మం, నకిరేకల్, వన్ టౌన్ పరిధిలో దొంగిలించినవి),4 మొబైల్ ఫోన్లు, ఒక డమ్మీ తుపాకీ, ఒక బటన్ చాకు, ఈ ఘటనపై నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు (Cr.No. 190/2026) నమోదు చేసి, నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం ఎస్పీ శరత్ చంద్ర పవార్.."గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు ప్రజల భాగస్వామ్యంతో కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి అక్రమ రవాణాపై సమాచారం ఉంటే వెంటనే Dial 100 కి గానీ, స్థానిక ఎస్హెచ్ఓకి గానీ సమాచారం అందించండి. సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతాం." ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎస్.ఐలు ముత్తయ్య, సంపత్, సిబ్బంది శ్రీనివాస్, శేఖర్, రబ్బాని, శంకర్, ఆంజనేయులు, అంజద్, కిరణ్, అంజయ్య, మహేష్‌లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి