ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి – ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి: లైన్‌వాడ యూపీహెచ్‌సీలో సీపీఎం సర్వే
ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి – ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి: లైన్‌వాడ యూపీహెచ్‌సీలో సీపీఎం సర్వే
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
నల్లగొండ పట్టణంలోని లైన్‌వాడ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్‌సీ)లో ఖాళీగా ఉన్న డాక్టర్, కమ్యూనిటీ ఆర్గనైజర్, ఏఎన్‌ఎం, ల్యాబ్ టెక్నీషియన్ తదితర పోస్టులను వెంటనే భర్తీ చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శుక్రవారం సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్లగొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో లైన్‌వాడ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ద్వారా నిర్వహిస్తున్న అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అనేక సమస్యలు పేరుకుపోయాయని అన్నారు.
ఇద్దరు డాక్టర్లు ఉండాల్సిన ఆసుపత్రిలో ఒక్క శాశ్వత డాక్టర్ కూడా లేకపోవడంతో, తాత్కాలిక డిప్యూటేషన్‌పై వచ్చిన డాక్టర్‌తోనే సేవలు కొనసాగుతున్నాయని, దీనివల్ల రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదని తెలిపారు. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు కూడా ఖాళీగా ఉందన్నారు. అలాగే ఏఎన్‌ఎం, కమ్యూనిటీ ఆర్గనైజర్ పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల ఆరోగ్య సేవలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.
ప్రతిరోజూ సుమారు 120 మంది రోగులు ఆసుపత్రికి వస్తున్నప్పటికీ, వారికి కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదన్నారు. నీటి సమస్య కారణంగా మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండి, ఆసుపత్రికి వచ్చిన వారే అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.సిబ్బంది యూనిఫాం మార్చుకునేందుకు డ్రెస్సింగ్ రూమ్ లేదని, నెలవారీ సమీక్ష సమావేశాలు నిర్వహించేందుకు మీటింగ్ హాల్, భోజనశాల, విశ్రాంతి గదులు వంటి కనీస మౌలిక వసతులు కూడా లేవని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సిబ్బంది సమర్థవంతంగా ఎలా పనిచేయగలరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతో పాటు, మీటింగ్ హాల్ నిర్మాణం చేపట్టాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సీపీఎం విద్య, వైద్య రంగాలపై నిర్వహిస్తున్న సర్వేలో వెలుగులోకి వస్తున్న సమస్యల ఆధారంగా దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కమిటీ సభ్యులు అవుట రవీందర్, దండంపల్లి సరోజ, అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ, కన్నెకంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి