క్విట్ ఇండియా స్ఫూర్తితో ఆగస్టు 10న “జైల్ భరో” విజయవంతం చేయాలి: సీఐటీయూ–రైతు–వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు
క్విట్ ఇండియా స్ఫూర్తితో ఆగస్టు 10న “జైల్ భరో” విజయవంతం చేయాలి: సీఐటీయూ–రైతు–వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఏకం కావాలి
లేబర్ కోడ్స్ ఉపసంహరణ వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన
జిల్లా సదస్సులో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదం
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 10న నిర్వహించనున్న “జైల్ భరో” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా సదస్సు పిలుపునిచ్చింది. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో పాల్గొని దేశ ఆర్థిక, సార్వభౌమ ప్రయోజనాలను కాపాడాలని నాయకులు కోరారు.
గురువారం నల్గొండలోని ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రంలోసీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడుతుమ్మల వీరారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడుముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తుల లింగస్వామి అధ్యక్షత వహించగా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నారి ఐలయ్య ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా విధానాలను వేగంగా అమలు చేస్తోందని ఆరోపించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలతో సాధించిన దేశ స్వాతంత్ర్యాన్ని విదేశీ, స్వదేశీ కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన క్విట్ ఇండియా ఉద్యమం మాదిరిగానే నేడు కార్పొరేట్ ఆధిపత్యం, మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోడ్స్ కార్మిక హక్కులను తీవ్రంగా దెబ్బతీస్తాయని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలకు పెంచే అవకాశాన్ని యాజమాన్యాలకు కల్పించడం, సమ్మె హక్కుపై ఆంక్షలు విధించడం, కార్మిక సంఘాల గుర్తింపు ప్రక్రియను కఠినతరం చేయడం, ఉద్యోగ భద్రతను బలహీనపరచడం వంటి నిర్ణయాలు కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం కలిగిస్తాయని పేర్కొన్నారు. 300 మంది లోపు ఉద్యోగులు ఉన్న సంస్థల్లో నోటీసు లేకుండానే కార్మికులను తొలగించే“హైర్ అండ్ ఫైర్” విధానం అమానుషమని విమర్శించారు. లేబర్ కోడ్స్ పూర్తిగా ఉపసంహరించుకునే వరకు ఉద్యమాలు కొనసాగించాలని సదస్సు తీర్మానించింది.
వ్యవసాయ రంగంపై కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని నాయకులు పేర్కొన్నారు. అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్ వంటి దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కారణంగా భారీ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయని, జీరో సుంకంతో వస్తున్న దిగుమతుల వల్ల దేశీయ పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడే విధానాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆగస్టు 10న రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న “జైల్ భరో” కార్యక్రమాన్ని ప్రతి మండలం, గ్రామం నుంచి ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని సదస్సు పిలుపునిచ్చింది. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజాస్వామ్య శక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించాలని నాయకులు కోరారు.
ఈ సదస్సులో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండి సలీం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు, నాయకులు చిన్నపాక లక్ష్మీనారాయణ, డబ్బికార్ మల్లేష్, కందాల ప్రమీల, బండ శ్రీశైలం, దండంపల్లి సత్తయ్య, బొజ్జ చినవెంకలు, గండమల రాములు, దండంపల్లి సరోజ, అవుట రవీందర్, మల్లు గౌతమ్ రెడ్డి, చింతపల్లి బయ్యన్న, ఏర్పుల యాదయ్య, కంబాలపల్లి ఆనంద్, పరశురాములు, కంచర్ల ఊర్మిళ, నలపరాజు సైదులుతదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి