ఈ నెల 26న నాగార్జున ప్రభుత్వ కళాశాలలో నిర్వహణ.. బ్రోచర్ ఆవిష్కరించిన ప్రిన్సిపాల్.
నల్లగొండ: ప్రముఖ సాహితీవేత్త ఆచార్య అనుమాండ్ల భూమయ్య సాహిత్య ప్రస్థానాన్ని నేటి తరానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో జాతీయ సదస్సుకు నాగార్జున ప్రభుత్వ కళాశాల వేదిక కానుంది. తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 26న “ఆచార్య అనుమాండ్ల భూమయ్య సాహిత్య స్వర్ణోత్సవం (1976–2026)” పేరుతో ఒక రోజు జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు.
సోమవారం కళాశాలలో ఇతర అధ్యాపకులతో కలిసి సదస్సు బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆచార్య అనుమాండ్ల భూమయ్య ఇప్పటివరకు 54 గ్రంథాలను రచించారని తెలిపారు. పద్యకవిగా, గేయకావ్యకర్తగా, విమర్శకునిగా భూమయ్య విశిష్ట గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఆయన సాహిత్య విశిష్టతను, రచనా వైభవాన్ని నేటి తరానికి చేరువ చేయడమే సదస్సు ప్రధాన ఉద్దేశమన్నారు.
దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ఆచార్యులు, పరిశోధకులు, అధ్యాపకులు, భాషావేత్తలు, విమర్శకులు సదస్సులో పాల్గొని భూమయ్య సాహిత్యంపై వివిధ అంశాల్లో పరిశోధనా పత్రాలను సమర్పించనున్నట్లు తెలిపారు. పరిశోధకులు, స్థానిక సాహితీవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. పరంగి రవికుమార్, డా. అంతటి శ్రీనివాసులు, తెలుగు శాఖ అధ్యక్షులు డా. వెల్దండి శ్రీధర్, పరీక్షల నియంత్రణాధికారి డా. డి. మునిస్వామి, విద్యాత్మిక సమన్వయకర్త బి. నాగరాజు, అధ్యాపకులు డా. వాస భూపాల్, డా. టంగుటూరి సైదులు, ఎస్. ప్రభాకర్, దండి అంజయ్య, లింగస్వామి, వనజ, శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి