కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ విరుచుకుపాటు నల్గొండలో గులాబీ నేతల ధ్వజం..
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్..
వాగ్దానాలన్నీ గాలికి అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం... రవీంద్ర కుమార్
నల్గొండ: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో తీవ్రంగా విఫలమైందని, ప్రజా సమస్యలను మళ్లించేందుకే అసెంబ్లీ వద్ద అరాచకాలు, ఫార్మ్‌హౌస్ డ్రామాలకు తెరలేపుతోందని బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా వారం రోజుల పాటు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తయిన సందర్భంలో నల్గొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, బండ నరేందర్ రెడ్డి, నోముల భగత్, కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడారు.
వాగ్దానాలన్నీ గాలికి.. అన్ని వర్గాలకూ మోసం: రవీంద్ర కుమార్
దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ వారం రోజులుగా జిల్లావ్యాప్తంగా నిర్వహించిన పోరుబాటలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారన్నారు. కేసీఆర్ హయాంలో అమలైన రైతుబీమా, దళితబంధు పథకాలను పూర్తిగా ఆపేశారని, రైతుబంధు, మిషన్ భగీరథలను మూలన పడేశారని విమర్శించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా, కొత్తగా ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు అందించకుండా మోసం చేశారన్నారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల సమక్షంలో ప్రకటించిన 16 డిక్లరేషన్లు వంద రోజుల్లో కాదు, వెయ్యి రోజుల్లో కూడా అమలు కాలేదని మండిపడ్డారు.
అసెంబ్లీ వద్ద దాడులు – డైవర్షన్ రాజకీయం..
అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీశ్రావు, జగదీష్ రెడ్డిలతో పాటు మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ అంశాన్ని తెరపైకి తెచ్చి ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. కేసీఆర్ ఫార్మ్‌హౌస్ ముట్టడికి పోలీసు రక్షణ ఇవ్వడం దుర్మార్గమని, రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే ప్రజలు చావుడప్పు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
హామీలు నెరవేర్చే వరకు పోరాటం ఆగదు బీఆర్ఎస్ నేతలు...
బండ నరేందర్ రెడ్డి..."వారం రోజుల నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసిన కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు. రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చిన పథకాలు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదు. అసెంబ్లీ ఘటనలపై హైకోర్టు కూడా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాకోర్టులో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు" అని పేర్కొన్నారు. నోముల భగత్ మాట్లాడుతూ.. "అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించకుండా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులు చేయడమే కాంగ్రెస్ నైజం. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ ఫార్మ్‌హౌస్ వద్ద డ్రామాలు ఆడుతున్నారు" అని విమర్శించారు.
కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ .."తెలంగాణను సాధించి, దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపిన ఘనత కేసీఆర్‌ది. కోమటిరెడ్డి సోదరులు కేవలం డ్రామాలు చేస్తున్నారు. 420 హామీలు, ఆరు గ్యారెంటీలపై నిలదీస్తామనే భయంతోనే అసెంబ్లీ వద్ద అరాచకం సృష్టించారు. కేసీఆర్ చావును కోరుకుంటూ చావుడప్పు కొడతామనడం కాంగ్రెస్ నేతల దిగజారుడుతనానికి నిదర్శనం. గులాబీ శ్రేణులు రగిలిపోతున్నాయి, కాంగ్రెస్ నేతలు ఖబర్దార్!" అని తీవ్రంగా హెచ్చరించారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు చెరుకు సుధాకర్, కంచర్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్ గౌడ్, రాంచందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నిరసనల అనంతరం నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి