గాలికి ఒకదానికొకటి తగులుతూ నిప్పులు.. పట్టించుకోని సిబ్బందిపై గ్రామస్తుల ఆగ్రహం.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిటపల్లి గ్రామంలో మెయిన్ విద్యుత్ లైన్లు ప్రమాదకరంగా మారాయి. గాలివానలకు విద్యుత్ వైర్లు ఒకదానికొకటి తగులుతూ మంటలు, నిప్పురవ్వలు ఎగసిపడుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయాందోళన చెందుతున్నారు.
సమస్యను పలుమార్లు సంబంధిత లైన్‌మన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పగా.. ‘చెప్పుకోండి’ అన్నట్లుగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని వారు వాపోతున్నారు. దీంతో విద్యుత్ శాఖ సిబ్బంది తీరుపై గ్రామస్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉండగా.. ప్రమాదకరంగా మారిన మెయిన్ విద్యుత్ లైన్ల కిందనే చిన్నారులు ప్రతిరోజూ ఆడుకుంటున్నారు. తీగలు తెగిపడినా, షార్ట్‌సర్క్యూట్ జరిగినా ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ప్రమాదం జరిగే వరకు అధికారులు వేచిచూడకుండా వెంటనే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. విద్యుత్ వైర్లను పరిశీలించి సరిచేయడంతోపాటు, అవసరమైన భద్రతా చర్యలు చేపట్టి చిన్నారులు, గ్రామస్తుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని విద్యుత్ శాఖ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి