పగటిపూటే తాళం వేసిన ఇళ్లే లక్ష్యం..
ప్రధాన నిందితుడు మహమ్మద్ నసీమ్ అరెస్టు రూ.3.25 లక్షల నగదు, స్కూటీ స్వాధీనం..
పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు.. అడిషనల్ ఎస్పీ జి.రమేష్
నల్గొండ : పగటి సమయంలో తాళం వేసి ఉన్న ఇళ్లు, అపార్ట్‌మెంట్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న కరడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టును నల్గొండ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాలోని ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రూ.3.25 లక్షల నగదుతో పాటు స్కూటీ, చోరీకి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ జి.రమేష్ వెల్లడించారు. శుక్రవారం నల్గొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
సిసి కెమెరాల ఆధారంగా చిక్కిన దొంగ..
గత నెల 26న నల్గొండ పట్టణంలోని వి.టి. కాలనీకి చెందిన ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్ తాళం పగులగొట్టి బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన ఘటనపై టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో (క్రైమ్ నెం. 286/2026, యు/ఎస్ 331(3), 305(అ) బిఎన్ఎస్) కేసు నమోదైంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు. ఆగస్టు 6న సాయంత్రం 5 గంటల సమయంలో పానగల్ బైపాస్ రోడ్డు వద్ద స్కూటీపై మళ్లీ చోరీకి యత్నిస్తున్న ప్రధాన నిందితుడు మహమ్మద్ నసీమ్ (48) (స్వస్థలం భజన్‌పురా, నార్త్ ఈస్ట్ ఢిల్లీ)ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నల్గొండ వన్‌టౌన్, టూటౌన్ పరిధులతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా వేదాయపాలెం, తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీస్‌స్టేషన్ల పరిధిలో పలు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడు.
ముఠా పనిచేసే తీరు ఇదిగో..
ముందుగా తాళం వేసిన ఇళ్లను గుర్తించి రెక్కీ నిర్వహించడం ఈ ముఠా శైలి. ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక, పగటి పూట ఇనుప రాడ్లతో తాళాలు పగులగొట్టి క్షణాల్లో నగలు, నగదుతో పరారయ్యేవారు. జులై 26న ప్రధాన నిందితుడు నసీమ్, సహచరుడు ఇర్షాద్ స్కూటీపై రాగా, షరీఫ్ అనే వ్యక్తి కారులో వచ్చి బయట కాపలా కాశాడు.ఈ ముగ్గురు కలిసి నల్గొండ వన్‌టౌన్ పరిధిలోని రెండు ఇళ్ల తాళాలు తీసి 5 తులాల బంగారం, రూ.30,000 నగదు, టూటౌన్ వి.టి.కాలనీలో 3 తులాల బంగారం దోచుకెళ్లారు. నెల్లూరు జిల్లా వేదాయపాలెంలో 24 తులాల బంగారం, 3 కిలోల వెండి.. తిరుపతి జిల్లా తిరుచానూరులో 9 తులాల బంగారం, 15 తులాల వెండిని దోచుకున్నట్లు తేలింది.
ఎన్నో క్రిమినల్ కేసులు,చర్లపల్లి జైలు శిక్ష కూడా..
ప్రధాన నిందితుడు నసీమ్ పాత నేరస్థుడు. గతంలో ఢిల్లీ, ఇండోర్ (మధ్యప్రదేశ్), మీరట్ (యుపి)లలో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై వచ్చాక, ఢిల్లీలో నిఘా పెరగడంతో హైదరాబాద్ వచ్చి రాయదుర్గం, ఉప్పల్, మల్కాజిగిరి పరిధిలో వరుస దొంగతనాలు చేశాడు. ఈ కేసుల్లో రెండేళ్లపాటు చర్లపల్లి జైలులో శిక్ష అనుభవించి, మూడు నెలల క్రితమే విడుదలయ్యాడు. ప్రస్తుతం అత్తాపూర్‌లో అద్దెకు ఉంటూ మళ్లీ పాత దందాను మొదలుపెట్టాడు. కేసులో పరారీలో ఉన్న మిగతా ఇద్దరు నిందితులు ఇర్షాద్, షరీఫ్‌ల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని అడిషనల్ ఎస్పీ తెలిపారు. డిఎస్పీ కె.శివరాం రెడ్డి పర్యవేక్షణలో కేసును వేగంగా ఛేదించిన వన్‌టౌన్ సీఐ ఎ.రాజశేఖర్ రెడ్డి, టూటౌన్ సీఐ కె.ఆది రెడ్డి, ఎస్ఐలు డి.సైదబాబు, ముత్తయ్య, జి.మానస, సిబ్బంది రబ్బాని, శంకర్, అంజద్, బాలకోటి, షకీల్, జానకి రాములు, హోంగార్డు శ్రీనులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి