జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్..
త్యాగధనుల స్ఫూర్తితో శాంతిభద్రతల పరిరక్షణకు పునరంకితం కావాలి..
నల్గొండ: దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం సమర్పించారు. అనంతరం సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
సమైక్యత.. భద్రతే ధ్యేయం!
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహనీయుల త్యాగఫలంతో సిద్ధించిన స్వాతంత్ర్యాన్ని కాపాడుకుంటూ, దేశ సమగ్రత, జాతీయ సమైక్యత మరియు సోదరభావాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలోనే కాకుండా దేశ ఐక్యతను కాపాడటంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తోందని గుర్తుచేశారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, మరింత మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని సూచించారు.
క్రమశిక్షణతో శాఖ ప్రతిష్టను పెంచాలి..
విధి నిర్వహణలో క్రమశిక్షణ, అంకితభావం, నిజాయితీ ప్రధానమైనవని ఎస్పీ స్పష్టం చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్టలను పునర్నిర్మించాలని కోరారు. ప్రజల సహకారాన్ని తీసుకుంటూ, శాంతియుత వాతావరణంలో నల్గొండ జిల్లాను మరింత సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు, వివిధ విభాగాల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి