మోతే జంట హత్యల కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్.. సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో గుర్తింపు
మోతే పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన భార్యాభర్తల జంట హత్యల కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మోతే పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ ఎండీ షరీఫ్ (23), మోతే గ్రామానికి చెందిన జిల్లేపల్లి సుందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు, స్థానికుల సమాచారంతో నిందితులను గుర్తించినట్లు జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ తెలిపారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు. మోతే మండల కేంద్రం సమీపంలోని జాతీయ రహదారి 365బీబీ ఫ్లైఓవర్‌కు సుమారు 200 మీటర్ల దూరంలో వ్యవసాయ భూమిలో మృతదేహాలు పాక్షికంగా పూడ్చిపెట్టినట్లు గురువారం ఉదయం స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే కోదాడ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్సై లచ్చిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి గుర్తించారు. మృతులు మోతే మండలం బిక్యాతండాకు చెందిన హాలావత్ నాగులు, ఆయన భార్య హాలావత్ బూబా (41)గా గుర్తించారు.
డబ్బుల వ్యవహారమే హత్యలకు కారణం
నిందితుడు షరీఫ్‌కు జిల్లేపల్లి సుందర్ ద్వారా నాగులు, బూబాతో పరిచయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. కుటుంబ అవసరాల కోసం బూబా, నాగులు కోరడంతో షరీఫ్ సుమారు రూ.3 లక్షలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన సమయంలో నాగులు దంపతులు షరీఫ్‌ను బెదిరించడంతో వారిని హతమార్చాలని పథకం వేసినట్లు విచారణలో వెల్లడైందని ఎస్పీ తెలిపారు.
పథకం ప్రకారం హత్య
గొర్రెల రుణం ఇప్పిస్తానని నమ్మించి, గొర్రెలను పరిశీలించేందుకు స్థలం కావాలని చెప్పి నాగులను నిందితులు తమ వెంట తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 11న రాత్రి షరీఫ్, సుందర్ కలిసి నాగులను మోటార్‌సైకిల్‌పై మోతే శివారులోని వ్యవసాయ భూమి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ గుంత తీయిస్తుండగా వెనుక నుంచి గుదిబండతో తలపై బలంగా కొట్టడంతో నాగులు మృతి చెందినట్లు తెలిపారు.
కొంతసేపటి తర్వాత బూబాను కూడా అదే ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను గుంతలో పాతిపెట్టారు. బూబా ఒంటిపై ఉన్న ఆభరణాలను కూడా నిందితులు తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
సీసీటీవీతో చిక్కిన నిందితులు
దర్యాప్తులో భాగంగా పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలో సుందర్, బూబాను తీసుకెళ్తున్న దృశ్యాలు పోలీసులకు లభించాయి. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ, స్థానికుల సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు నిందితులను గుర్తించారు.
శుక్రవారం ఉదయం సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద ప్రత్యేక పోలీసు బృందాలు షరీఫ్, సుందర్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశాయి. విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
హత్యకు ఉపయోగించిన వస్తువులు స్వాధీనం
నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన గుదిబండ, ఏ1 షరీఫ్‌కు చెందిన మోటార్‌సైకిల్, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తులో పారదర్శకత కోసం దర్యాప్తు బాధ్యతలను సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్‌కు అప్పగించినట్లు ఎస్పీ తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన కోదాడ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, ఎస్సై లచ్చిరెడ్డి, సీసీఎస్ ఎస్సైలు సాయిరాం, హరికృష్ణతో పాటు సీసీఎస్ సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి