Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 02, 2026 02:20 PM

ఏపూరు లో అక్రమ బాణాసంచా నిల్వలపై దాడి – రూ. 30 లక్షల స్టాక్ స్వాధీనం

ఏపూరు లో అక్రమ బాణాసంచా నిల్వలపై దాడి – రూ. 30 లక్షల స్టాక్ స్వాధీనం

ఏపూరు లో అక్రమ బాణాసంచా నిల్వలపై దాడి – రూ. 30 లక్షల స్టాక్ స్వాధీనం
March 02, 2026 12:34 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా, పెదపాడు మండలం ఏపూరు లో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన భారీ మొత్తంలో బాణాసంచాను పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ శాఖల సంయుక్త బృందం స్వాధీనం చేసుకుంది. పెదపాడు మండలం ఏపూరు గ్రామంలోని ఒక దుకాణం, గోదాంపై నిర్వహించిన ఆకస్మిక దాడిలో దాదాపు రూ. 30 లక్షల విలువైన స్టాక్‌ను అధికారులు పట్టుకున్నారు.

జిల్లా వ్యాప్తంగా బాణాసంచా నిల్వ కేంద్రాలపై ముమ్మర తనిఖీలు చేపట్టాలని కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశించిన నేపథ్యంలో ఈ చర్యలు కొనసాగుతున్నాయి. ఆయన ఆదేశాల మేరకు నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ సూచనలతో, పెదవేగి ఇన్స్‌పెక్టర్ సిహెచ్. రాజశేఖర్ పర్యవేక్షణలో ఆదివారం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు.

ఏపూరు గ్రామంలోని లక్ష్మీనారాయణ క్రాకర్స్ షాప్ మరియు అనుబంధ గోదాంపై అధికారులు దాడి చేయగా, ప్రభుత్వం సూచించిన భద్రతా ప్రమాణాలను పాటించకపోవడంతో పాటు లైసెన్స్‌లో అనుమతించిన పరిమితికి మించి బాణాసంచా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో నిల్వ చేసిన ఈ స్టాక్‌ను స్వాధీనం చేసుకొని యజమానిపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

బాణాసంచా నిల్వలపై అధికారుల హెచ్చరిక

బాణాసంచా నిల్వలో నిర్లక్ష్యం వహిస్తే భారీ ప్రాణ, ఆస్తి నష్టానికి దారితీస్తుందని అధికారులు హెచ్చరించారు. ప్రజా భద్రత కంటే వ్యాపారం ముఖ్యం కాదని, నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

యజమానులు తప్పనిసరిగా పాటించవలసిన భద్రతా సూచనలు

లైసెన్స్ పరిమితి: లైసెన్స్‌లో పేర్కొన్న పరిమితికి మించి ఒక్క కిలో కూడా నిల్వ ఉంచరాదు.

వేర్వేరు నిల్వ గదులు: అధిక పేలుడు తీవ్రత గల బాణాసంచాను, తక్కువ తీవ్రత గల వాటిని వేర్వేరు గదుల్లో ఉంచాలి.

నిర్మాణ ప్రమాణాలు: నివాస ప్రాంతాలకు దూరంగా, కాంక్రీట్ భవనాల్లోనే నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.

వెంటిలేషన్: గోడలకు ఆనించి బాక్సులు ఉంచకూడదు. కనీసం రెండు అడుగుల ఖాళీ ఉండాలి.

రసాయన భద్రత: గంధకం వంటి ముడి రసాయనాలను సిద్ధంగా ఉన్న బాణాసంచాతో కలిపి ఉంచరాదు.

హ్యాండ్లింగ్ జాగ్రత్తలు: బాక్సులను విసరడం, నేలపై ఈడ్చడం చేయరాదు. రాపిడి వల్ల నిప్పు రవ్వలు చెలరేగే ప్రమాదం ఉంది.

అగ్నిమాపక ఏర్పాట్లు: ఆటోమేటిక్ స్ప్రింక్లర్ వ్యవస్థ, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు తప్పనిసరిగా ఉండాలి.

అత్యవసర చికిత్స: కాలిన గాయాలకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి.

సీసీటీవీ నిఘా: గోదాంల వద్ద 24 గంటల భద్రత, సీసీటీవీ పర్యవేక్షణ ఉండాలి.

ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా బాణాసంచా వ్యాపారులలో ఆందోళన నెలకొంది. అధికారులు తనిఖీలు మరింత ముమ్మరం చేయనున్నట్లు సమాచారం.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News