మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఇంటి ముట్టడి.. గాంధీభవన్ ముట్టడికి సిద్ధం
భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ హెచ్చరిక
చివ్వెంల: రాష్ట్ర వికలాంగుల హక్కుల చట్టం–2016 సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్ర వికలాంగుల యాక్ట్ కమిషనర్‌గా వికలాంగుడినే నియమించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. సకలాంగుడిని నియమిస్తే సహించేది లేదని హెచ్చరించారు. డిమాండ్ల సాధన కోసం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నివాసాన్ని ముట్టడించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్‌ను ముట్టడించి ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల గ్రామంలో బుధవారం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి ఈదయ్యబాబు అధ్యక్షతన నిర్వహించిన గ్రామ ముఖ్య నాయకుల సమావేశానికి గిద్దె రాజేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వికలాంగుల సమస్యలను ప్రత్యక్షంగా అనుభవించిన వారికే వాటిపై పూర్తి అవగాహన ఉంటుందని, అందువల్ల కమిషనర్‌గా వికలాంగుడినే నియమించాలని కోరారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు వికలాంగుల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచాలని, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని వికలాంగుల బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని, వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించేలా అసెంబ్లీలో చట్టం చేయాలని, రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని గిద్దె రాజేష్ హెచ్చరించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నివాసంతో పాటు గాంధీభవన్‌ను ముట్టడించి ప్రభుత్వంపై ప్రజాస్వామ్యబద్ధమైన దండయాత్ర చేపడతామని స్పష్టం చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి ఈదయ్యబాబు, జిల్లా అధ్యక్షుడు గోగుల శేఖర్‌రెడ్డి, సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు మున్నా మధు యాదవ్, రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిపల్లి సుమతి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి