Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 23, 2026 01:33 AM

రైతు–కార్మిక వ్యతిరేక విధానాలు రద్దు చేయాలి

రైతు–కార్మిక వ్యతిరేక విధానాలు రద్దు చేయాలి

రైతు–కార్మిక వ్యతిరేక విధానాలు రద్దు చేయాలి
February 12, 2026 06:38 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అఖిలపక్షాల డిమాండ్.. కూసుమంచిలో భారీ నిరసన

కూసుమంచి,: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణమే రద్దు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక సమ్మెలో భాగంగా కూసుమంచి మండల కేంద్రంలో రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చెరుకుపల్లి వీరయ్య అధ్యక్షతన జరిగిన సభలో ఖమ్మం జిల్లా రైతు సంఘం నాయకుడు బిక్కసాని గంగాధర్ గారు, ఖమ్మం జిల్లా రైతు కార్మిక సంఘం అధ్యక్షుడు బజ్జూరి వెంకటరామిరెడ్డి గారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనుసరిస్తున్న విదేశీ సామ్రాజ్యవాద, స్వదేశీ కార్పొరేట్ అనుకూల విధానాలను తీవ్రంగా విమర్శించారు. అమెరికా, యూరోప్ యూనియన్ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వల్ల భారతదేశాన్ని సామ్రాజ్యవాద శక్తులు దోచుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

వ్యవసాయ రంగం ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేక సంక్షోభంలో ఉందని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సమయంలో పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ వంటి పంటలను దిగుమతి సుంకం లేకుండా దేశంలోకి అనుమతిస్తే స్థానిక రైతుల పంటలను ఎవరు కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. దేశ ఎగుమతులపై 18 శాతం పన్ను విధించి, విదేశీ దిగుమతులపై 11 శాతం సుంకాన్ని శూన్యానికి తగ్గించడం దారుణమని అన్నారు.స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వల్ల సుమారు 45 లక్షల 50 వేల కోట్ల రూపాయల విలువైన సరుకులు దేశంలో అమ్మి విదేశీ సంస్థలు లాభాలు పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. విదేశీ విత్తన సంస్థలకు అనుకూలంగా ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా రైతులను కార్పొరేట్ సంస్థల ఆధీనంలోకి నెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా నిధుల విషయంలో మార్పులు చేసి, కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం ఇవ్వాలనే నిబంధన పెట్టి రాష్ట్రాలు ఇవ్వని పక్షంలో కేంద్రం కూడా ఇవ్వకుండా పథకాన్ని బలహీనపరిచే కుట్ర జరుగుతోందన్నారు. విద్యుత్ బిల్లుల సవరణ పేరుతో విద్యుత్ రంగాన్ని ప్రైవేటు చేతుల్లోకి అప్పగించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.

బ్రిటిష్ కాలం నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కార్మిక కోడ్‌లుగా మార్చడం వల్ల కార్మికుల హక్కులు హరించబడుతున్నాయని తెలిపారు. కార్పొరేట్ పెట్టుబడి సంస్థల ఆధీనంలో కార్మికులు పనిచేసే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.రైతు, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంఘటితంగా బలమైన ఉద్యమాలు నిర్మించి తమ హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాతంగి రామస్వామి, పోటు లక్ష్మయ్య , బుర్ర సైదులు, పిట్టల సత్యనారాయణ , ఆన్తోటి పుల్లయ్య , పందిరి శ్రీను, వెంకన్న , కందుల వెంకన్న, కనకం గోపయ్య , లింగా , గోపి , రవి , అనిల్ , వెంకటయ్య , నరేష్ , నాగేశ్వరరావు , లాల్మియా, బాలకృష్ణ , అశోక్ , వినోద్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News