ఆచార్య జయశంకర్ ఆశయాలే తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శకం.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఉద్యమానికి వెన్నెముకగా నిలిచారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు.
ఆచార్య జయశంకర్ 92వ జయంతి సందర్భంగా గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 1969 తెలంగాణ ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం వరకు ఆచార్య జయశంకర్ పోషించిన పాత్ర చారిత్రాత్మకమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపి, రాష్ట్ర సాధనకు మార్గనిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తిగా ఆయన నిలిచారని కొనియాడారు.
అధ్యాపకుడిగా వేలాది మంది విద్యార్థులకు మార్గనిర్దేశం చేసిన జయశంకర్, సమాజం పట్ల బాధ్యత, తెలంగాణ పట్ల అంకితభావాన్ని పెంపొందించారని తెలిపారు. ఆయన ఆశయాలను అనుసరిస్తూ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
చదువు జీవితాన్ని మార్చే శక్తివంతమైన సాధనమని పేర్కొన్న కలెక్టర్, ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వం, అధికారులు, సమాజం కలిసి పనిచేయాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల నుంచి పాఠశాలల వరకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి, విలువలతో కూడిన విద్యను అందించాలని అన్నారు.
ఈ సందర్భంగా బీసీ ఫ్రంట్ చైర్మన్ జి. మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య జయశంకర్ చేసిన త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా సమానత్వ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి కేశురాం, జిల్లా సంక్షేమ అధికారి శాంతిశ్రీ, కలెక్టరేట్ ఏఓ సునీల్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, వెనుకబడిన సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి