ఫుడ్ సేఫ్టీ ఉల్లంఘనలపై కొరడా.. నల్గొండలో 20 కేసులకు రూ.7.91 లక్షల జరిమానా
ఫుడ్ సేఫ్టీ ఉల్లంఘనలపై కొరడా.. నల్గొండలో 20 కేసులకు రూ.7.91 లక్షల జరిమానా
Komidala Mahender reddy
నల్గొండ, ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఆహార భద్రత అంశంలో అధికారులు కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించిన వ్యాపారులపై నల్గొండ జిల్లాలో చేపట్టిన చర్యల్లో భాగంగా 20 అడ్జుడికేషన్ కేసులను విచారించి మొత్తం రూ.7.91 లక్షల జరిమానా విధించారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జె. శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లా వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవల రిటైల్ షాపులు, హోటళ్లు, కిరాణా దుకాణాలు, బేకరీలు, మిల్క్ సెంటర్లు, ఆహార తయారీ యూనిట్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా ఆహార భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం, లైసెన్సులు లేకుండా వ్యాపారం నిర్వహించడం, పరిశుభ్రత లోపించడం వంటి ఉల్లంఘనలు గుర్తించి సంబంధిత వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.
ఈ కేసులపై నిర్వహించిన విచారణలో సహాయ ఆహార నియంత్రణ అధికారి వి. జ్యోతిర్మయి పాల్గొనగా, జిల్లా ఆహార భద్రతాధికారి ఎన్. శివశంకర్ రెడ్డి కేసుల వివరాలను సమర్పించారు. అందుబాటులో ఉన్న ఆధారాలు, నిబంధనల ఉల్లంఘనల తీవ్రతను పరిశీలించిన అనంతరం జరిమానాలు విధించినట్లు అధికారులు తెలిపారు.
అధికారులు మాట్లాడుతూ, ప్రతి ఆహార వ్యాపారి తప్పనిసరిగా ఫుడ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ పొందాలని సూచించారు. వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన ఆహార పదార్థాలను అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఫుడ్ సేఫ్టీ శాఖ తనిఖీలు కొనసాగిస్తోందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భవిష్యత్తులోనూ మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లైసెన్స్ లేకపోతే చర్యలు తప్పవు
ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయం నిర్వహించే ప్రతి వ్యాపారి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం ప్రకారం లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. నిబంధనలను విస్మరించే వారిపై జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి