ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నలుగురికి షోకాజ్ నోటీసులు..
రాష్ట్రవ్యాప్తంగా 37 మందికి ఇంటర్ బోర్డు హెచ్చరికలు..
నల్లగొండ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నకిలీ విద్యార్హత పత్రాలతో (ఫేక్ సర్టిఫికెట్లు) అధ్యాపక ఉద్యోగాలు పొందిన వైనం కలకలం రేపుతోంది. గతంలో ఒప్పంద (కాంట్రాక్ట్) ప్రాతిపదికన పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్లను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం క్రమబద్ధీకరించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రక్రియ సమయంలో పలువురు అభ్యర్థులు అక్రమ మార్గాల్లో పొందిన నకిలీ ధ్రువపత్రాలను సమర్పించి ఉద్యోగాలను ఖరారు చేసుకున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి ఉన్నతాధికారుల తనిఖీల్లో తేలింది.
అన్ని రాష్ట్రాల్లోని కొన్ని విశ్వవిద్యాలయాల పేరుతో పీజీ సహా ఇతర కోర్సుల నకిలీ సర్టిఫికెట్లను సృష్టించి, ఇంటర్ బోర్డుకు అందజేసి అక్రమంగా రెగ్యులరైజ్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా విచారణ చేపట్టిన విద్యాశాఖ.. మొత్తం 37 మంది అధ్యాపకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన నలుగురు లెక్చరర్లు ఉండటం గమనార్హం.
నోటీసులు అందుకున్న వారి వివరాలు..నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఫిజిక్స్ (భౌతికశాస్త్రం) అధ్యాపకులు, సూర్యాపేట & కోదాడ ఈ ప్రాంతాల ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధిస్తున్న ఒక మహిళా అధ్యాపకురాలు, సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన బోటనీ (వృక్షశాస్త్రం) అధ్యాపకుడు. నోటీసులు అందుకున్న అధ్యాపకులు వారం రోజుల్లోగా తమ విద్యార్హతలకు సంబంధించిన అసలు ధ్రువపత్రాలు, సమగ్ర ఆధారాలను ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించాలని ఆదేశించారు. వారు ఇచ్చే వివరణ, ఆధారాల పరిశీలన ఆధారంగా తదుపరి శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి