ప్రైవేటీకరణ వద్దు.. ప్రజా విద్యుత్ ముద్దు..!
ప్రైవేటీకరణ వద్దు.. ప్రజా విద్యుత్ ముద్దు..!
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.. పీఆర్‌సీ వెంటనే అమలు చేయాలి: సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం
విద్యుత్ రంగాన్ని సంస్కరణల పేరుతో ప్రైవేటీకరించే కేంద్ర ప్రభుత్వ విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను బలోపేతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.
మంగళవారం ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని రాష్ట్ర కమిటీ ముద్రించిన కరపత్రాలను నల్లగొండలోని ఎస్‌ఈ కార్యాలయంతో పాటు ఎలక్ట్రిసిటీ స్టోర్లో ఉద్యోగులు, కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎండీ సలీం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యుత్ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు.
2003లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేస్తూ విద్యుత్ చట్టాన్ని తీసుకువచ్చిందని ఆయన గుర్తు చేశారు. అనంతరం 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగ సంస్కరణలను మరింత వేగవంతం చేస్తూ విద్యుత్ సవరణ బిల్లు–2022ను ప్రవేశపెట్టి, ప్రస్తుతం 2025 బిల్లు ద్వారా అమలు దిశగా చర్యలు చేపడుతోందని ఆరోపించారు.
ఈ విధానాలను అమలు చేసే రాష్ట్ర ప్రభుత్వాలకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 3 శాతం నుంచి 5 శాతానికి పెంచడం, 50 సంవత్సరాల కాలపరిమితితో రుణాలు అందించడం, తక్కువ వడ్డీతో ఆర్థిక సహాయం కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రలోభాలకు గురిచేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ విధానాల ద్వారా ప్రభుత్వ విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్‌ను ప్రైవేటు సంస్థలు వినియోగించే అవకాశం కల్పించడంతో పాటు, సరఫరా చేసే ప్రతి యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వాలు లేదా వినియోగదారులే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.
ఇది మొత్తం విద్యుత్ రంగాన్ని క్రమంగా ప్రైవేటీకరణ వైపు నెట్టే కుట్ర అని ఎండీ సలీం ఆరోపించారు. ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను బలహీనపరచడంతో పాటు భవిష్యత్తులో కొత్త ఉద్యోగాల నియామకాలు లేకుండా చేసే ప్రమాదం ఉందని అన్నారు. విద్యుత్ సంస్థలను రక్షించాలంటే ఉద్యోగులు, కార్మికులు, ఇంజనీర్లు, ప్రజలు కలిసి పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
ఆర్టిజన్ కార్మికుల సమస్యలపై కూడా ఆయన ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. ఏప్రిల్ 17న ఉప ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన చర్చల్లో ఆర్థిక భారం లేని డిమాండ్లను సీఎండీతో చర్చించి పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కార్మికులు సమ్మె విరమించారని గుర్తు చేశారు. అయితే సమ్మె విరమించి 68 రోజులు గడిచినా ఒక్క హామీ కూడా అమలు కాలేదని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
అలాగే విద్యుత్ ఉద్యోగుల వేతన ఒప్పందం గడువు ముగిసి రెండు నెలలు దాటినా ప్రభుత్వం ఇప్పటికీ కొత్త పీఆర్‌సీని ప్రకటించకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఎలాంటి ఆలస్యం చేయకుండా2026 పీఆర్‌సీని వెంటనే నియమించి, కొత్త వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిర్ణయంతో పెన్షనర్లతో కలిపి సుమారు70 వేల కుటుంబాలు ప్రయోజనం పొందుతాయని తెలిపారు.
విద్యుత్ రంగాన్ని కాపాడాలంటే ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు, ఇంజనీర్లు, ఉద్యోగులు ఐక్యంగా ఉద్యమించాలని, ప్రజలకు కూడా ఈ విధానాల ప్రభావంపై అవగాహన కల్పించాలని ఎండీ సలీం పిలుపునిచ్చారు. పోరాటాల ద్వారానే ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను, ఉద్యోగాలను, వినియోగదారుల ప్రయోజనాలను రక్షించగలమని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ స్టోర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడుకత్తుల యాదయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడుదండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు జంజిరాల శ్రీనివాస్, సలివోజు సైదాచారి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి