ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!
ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!
NM Yadav
రోగులతో మాట్లాడి సేవలపై ఆరా..
మందుల కొరతపై అధికారులకు ఫోన్లోనే క్లాస్..
డి-అడిక్షన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం..
నల్గొండ : జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన.. రోగులకు అందుతున్న వైద్య సేవలపై స్వయంగా ఆరా తీశారు. ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా కలెక్టర్ రాకతో ఆసుపత్రి వర్గాల్లో కాస్త కలకలం రేగింది.
రిజిస్టర్ల పరిశీలన..రోగులతో ముఖాముఖి..
కలెక్టర్ చంద్రశేఖర్ ముందుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయానికి చేరుకుని సిబ్బంది హాజరు రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వెల్‌నెస్ సెంటర్‌ను సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో ముఖాముఖి మాట్లాడారు. వైద్యం సక్రమంగా అందుతోందా? ఆసుపత్రిలోనే మందులు ఇస్తున్నారా? బయట రాయడం లేదు కదా?" అని కలెక్టర్ రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో కొన్ని రకాల మందులు అందుబాటులో లేవని రోగులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్.. తక్షణమే సంబంధిత ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. మందుల సరఫరా పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకుని, రోగులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన మందులన్నింటినీ వెంటనే అందుబాటులో ఉంచాలని గట్టిగా ఆదేశించారు.
డి-అడిక్షన్ సెంటర్ పనులు వేగవంతం చేయాలి..
ఆసుపత్రిలో త్వరలోనే ప్రారంభం కానున్న 'డి-అడిక్షన్' (వ్యసన విముక్తి) సెంటర్‌ను కలెక్టర్ పరిశీలించారు. మాదకద్రవ్యాల వ్యసనానికి గురైన వారికి ఇక్కడ ప్రత్యేక కౌన్సిలింగ్ సౌకర్యాలు కల్పించాలన్నారు. రోగుల అవసరాలకు అనుగుణంగా వివిధ విభాగాలను వేర్వేరుగా ఏర్పాటు చేయాలని, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ఎంసీహెచ్ వార్డులో సంతృప్తి..
అనంతరం మాతా శిశు ఆరోగ్య (ఎంసీహెచ్) వార్డును సందర్శించిన కలెక్టర్.. గర్భిణులతో మాట్లాడారు. వైద్యులు, సిబ్బంది తమను బాగా చూసుకుంటున్నారని వారు తెలపడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడే విధుల్లో ఉన్న ఆశా కార్యకర్తలను పలకరించి, గర్భిణులను ఏయే ప్రాంతాల నుంచి తీసుకువచ్చారో అడిగారు. మునుగోడు ప్రాంతం నుంచి వచ్చామని వారు చెప్పగా.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. ఫార్మసీ విభాగాన్ని తనిఖీ చేసి, మందుల నిల్వలు, పంపిణీ రిజిస్టర్లను తనిఖీ చేశారు.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు..
తనిఖీ అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి పేద రోగికి నాణ్యమైన వైద్యం అందడమే లక్ష్యంగా పనిచేయాలి. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకూడదు. ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ఆసుపత్రుల ప్రధాన బాధ్యత అని గుర్తుంచుకోవాలి. ఈ తనిఖీలో ఆసుపత్రి సూపరింటిండెంట్ నేత నరసింహారావు, డాక్టర్ శ్రీకాంత్, ఇతర వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి