Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘాట్‌ రోడ్డు కాదు.. గుప్తనిధుల కోసమే తవ్వుతున్నారా? - మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ బదిలీ రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 06, 2026 06:03 PM

ఏసీబీ వలలో వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్!

ఏసీబీ వలలో వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్!

ఏసీబీ వలలో వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్!
June 06, 2026 04:42 PM 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav


మసీదు భూమి నివేదిక కోసం రూ.10 వేల లంచం తీసుకుంటూ దొరికిపోయాడు..

మిర్యాలగూడ బస్టాండ్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు..

నిందితుడి ఇల్లు, కార్యాలయంలో ముమ్మర సోదాలు..

నల్లగొండ : మసీదుకు సంబంధించిన భూమి రికార్డులను ఉన్నతాధికారులకు పంపేందుకు లంచం డిమాండ్ చేసిన నల్లగొండ జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమూద్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. మిర్యాలగూడ బస్టాండ్ ప్రాంగణంలో శనివారం బాధితుడి నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.. జిల్లాలోని పెద్దవూర మండల కేంద్రంలో సుమారు 900 గజాల స్థలంలో ఒక మసీదు, దానికి అనుకుని ఖాళీ స్థలం ఉంది. గతంలో దాతలు ఇచ్చిన ఈ స్థలానికి సంబంధించి కొంతకాలంగా వివాదం నడుస్తోంది. దీంతో సదరు మసీదును, ఖాళీ స్థలాన్ని పూర్తిగా వక్ఫ్ బోర్డు పరిధిలోకి (టేక్ ఓవర్) తీసుకోవాలని కోరుతూ మసీదు కమిటీ ప్రతినిధులు 2025 ఫిబ్రవరిలో వక్ఫ్ బోర్డు ప్రధాన కార్యనిర్వహణాధికారి (సీఈవో)కి వినతిపత్రం సమర్పించారు.

నివేదిక ఇవ్వకుండా ‘నిలిపివేత’..

మసీదు కమిటీ ఫిర్యాదుపై స్పందించిన సీఈవో క్షేత్రస్థాయి పరిశీలన జరపాల్సిందిగా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమూద్, సర్వేయర్‌తో కలిసి సదరు స్థలాన్ని సందర్శించి సర్వే పూర్తి చేశారు. అయితే, సర్వే ప్రక్రియ ముగిసినప్పటికీ, ఉన్నతాధికారులకు పంపాల్సిన అధికారిక నివేదికను ఇన్స్పెక్టర్ మహమూద్ తన వద్దే తొక్కిపెట్టాడు. సదరు రిపోర్టును సీఈవో కార్యాలయానికి పంపించాలంటే తనకు రూ.10 వేల లంచం ఇవ్వాలని మసీదు కమిటీ ప్రతినిధిని డిమాండ్ చేశాడు. న్యాయంగా జరగాల్సిన పని కోసం ప్రభుత్వ అధికారి లంచం డిమాండ్ చేయడంతో విసిగిపోయిన బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు.

పక్కా స్కెచ్.. పట్టుబడ్డారిలా..

​బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర నేతృత్వంలోని బృందం పక్కా వ్యూహం రచించింది. శనివారం నిందితుడు మహమూద్ సూచన మేరకు మిర్యాలగూడ బస్టాండ్ వద్దకు బాధితుడు చేరుకున్నాడు. అక్కడ బాధితుడి నుంచి రసాయనాలు పూసిన రూ.10 వేల నగదును ఇన్స్పెక్టర్ తీసుకుంటుండగా, అప్పటికే నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు మెరుపువేగంతో దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం ఆయన చేతులకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది.

ఇల్లు, కార్యాలయాల్లో విస్తృత సోదాలు..

​ఇన్స్పెక్టర్ మహమూద్‌ను అదుపులోకి తీసుకున్న అనంతరం ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒక బృందం నల్లగొండ కలెక్టరేట్ సముదాయంలోని వక్ఫ్ బోర్డు కార్యాలయంలో సోదాలు నిర్వహించి కీలక రికార్డులను స్వాధీనం చేసుకోగా, మరో ప్రత్యేక బృందం మిర్యాలగూడలోని నిందితుడి నివాసంలో తనిఖీలు చేపట్టింది. లంచం తీసుకుంటూ దొరికిపోయిన వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమూద్‌పై కేసు నమోదు చేశామని, ప్రాథమిక విచారణ మరియు సోదాల అనంతరం సాక్ష్యాధారాలతో సహా ఆయనను నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అధికారులు లేదా సిబ్బంది లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్‌కు గానీ, స్థానిక అధికారులకు గానీ సమాచారం అందించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News