బాలల్లో నాయకత్వ లక్షణాలు పెంచాలి..
బాలల్లో నాయకత్వ లక్షణాలు పెంచాలి..
NM Yadav
చెర్లగౌరారంలో ఘనంగా ‘బాల పంచాయతీ’..
హాజరైన టీజీపీఏ డైరెక్టర్ అభిలాషా బిష్త్, కలెక్టర్, ఎస్పీ..
సమస్యలపై గళమెత్తిన చిన్నారులు..
కనగల్ : పిల్లల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, సమస్యల పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా నల్లగొండ జిల్లా కనగల్ మండలం చెర్లగౌరారం గ్రామంలో నిర్వహించిన ‘బాల పంచాయతీ’ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. జిల్లా పోలీస్ శాఖ, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆదేశాల మేరకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీజీపీఏ డైరెక్టర్ అభిలాషా బిష్త్ ఐపీఎస్, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. గ్రామస్థాయి నుంచే పిల్లలకు ప్రజాస్వామ్య విధానాలపై అవగాహన కల్పించడం గ్రామాభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
సమస్యలపై గళమెత్తిన బాలలు..
కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బాలల సభలో విద్యార్థులు గ్రామంలోని పలు సమస్యలపై ధైర్యంగా గళమెత్తారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, బాలల భద్రత, విద్యా ప్రమాణాలు, గ్రామాభివృద్ధి వంటి అంశాలపై చిన్నారులు ప్రజాప్రతినిధులు, అధికారుల తరహాలోనే చర్చించారు. బాలలతో నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్లు, ప్రశ్నోత్తరాల సమయం అందరినీ ఆకట్టుకుంది.
పిల్లల రక్షణ కుటుంబం బాధ్యతే అభిలాషా బిష్త్..
ఈ సందర్భంగా టీజీపీఏ డైరెక్టర్ అభిలాషా బిష్త్ మాట్లాడుతూ.. పిల్లల హక్కుల రక్షణ, వారి భవిష్యత్ నిర్మాణం సమాజానికి అత్యంత ముఖ్యమన్నారు. పిల్లల రక్షణ అనేది కుటుంబం నుంచే ప్రారంభం కావాలని, ప్రతి తల్లిదండ్రులు పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించి వారి ఆలోచనలను ప్రోత్సహించాలని సూచించారు. వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి సరైన దిశలో మార్గనిర్దేశం చేస్తే భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడే గొప్ప నాయకులుగా ఎదుగుతారన్నారు. "పిల్లలే మన భవిష్యత్తు.. వారికి సమయం ఇవ్వండి, వారి ఆలోచనలను వినండి" అని పిలుపునిచ్చారు.
సమాజంలో మార్పు రావాలి.. ఎస్పీ, కలెక్టర్..
జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచే పిల్లలకు నాయకత్వ అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావచ్చన్నారు. చదువుతో పాటు సామాజిక అవగాహన కూడా అవసరమన్నారు. అనంతరం ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. బాలల భద్రత, విద్య, మానసిక వికాసం కోసం జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని, ప్రతి గ్రామంలో ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో యంగిస్థాన్, ఆశ్రిత ఎన్జీఓ ప్రతినిధులు పాల్గొని బాలల హక్కులు, సురక్షిత బాల్యం, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. గ్రామంలో బాలల సాధికారత, సంక్షేమం కోసం అన్ని విధాలా సహకరిస్తామని స్థానిక సర్పంచ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఎంపీడీఓ వేద రక్షిత, సీఐలు ఆది రెడ్డి, రాము, కరుణాకర్, ఎస్సైలు అంజలి, రాజీవ్ రెడ్డి, డీడబ్ల్యూఓ కృష్ణవేణి, డీఈఓ సుశీందర్ రావు, సీడబ్ల్యూసీ చైర్మన్ కృష్ణయ్య, చెర్లగౌరారం సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి