మనిషి జీవితంలో మార్పు తెచ్చిన మహోన్నతుడు అంబేద్కర్*
మనిషి జీవితంలో మార్పు తెచ్చిన మహోన్నతుడు అంబేద్కర్*
Biksham
చదువుతోనే అభివృద్ధి సాధ్యం: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార
బడుగు, బలహీన వర్గాల వారికి రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించి మనిషి జీవితంలో మహత్తర మార్పు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. చదువు ద్వారానే అభివృద్ధి సాధ్యమని నిరూపించిన అంబేద్కర్‌కు మనమంతా రుణపడి ఉండాలని పేర్కొన్నారు.మంగళవారం అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా షెడ్యూలు కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సభలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి మున్సిపల్ చైర్మన్, అదనపు ఎస్పీతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కలెక్టర్ మాట్లాడుతూ అంబేద్కర్ చిన్ననాటి నుంచే కుల వివక్షను ఎదుర్కొన్నప్పటికీ విద్యతో ఎదిగి సమాజానికి మార్గదర్శకుడయ్యారని తెలిపారు. ప్రజా సంక్షేమం, సమాన హక్కుల సాధన కోసం రాజ్యాంగాన్ని రూపొందించి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించారని చెప్పారు. న్యాయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో లోతైన పరిజ్ఞానం సంపాదించి దేశ అభివృద్ధికి బాటలు వేసిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు.సామాజిక, ఆర్థిక సమానత్వం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, విద్య, ఆరోగ్యంపై బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతున్నదని, జిల్లాలో తొండ, చిలుకూరు, గడ్డిపల్లి ప్రాంతాల్లో సమగ్ర పాఠశాలల నిర్మాణానికి ఒక్కొక్కదానికి రూ. 200 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు.
జిల్లా ఎస్పీ కె. నరసింహ మాట్లాడుతూ అంబేద్కర్ ప్రపంచ మేధావి, గొప్ప మహానీయుడు అని కొనియాడారు. సమాజంలోని అన్ని వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు అనేక హక్కులు కల్పించారని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత మాట్లాడుతూ అణగారిన వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ చేసిన కృషి అమోఘమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీలలో విజేతలకు కలెక్టర్, ఎస్పీ బహుమతులు అందజేశారు. రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ప్రజలతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రవాణా అధికారి జయప్రకాశ్ రెడ్డి, ఎస్సీ సంక్షేమ అధికారి కొల్లి లత, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, వైస్ చైర్మన్ షఫీఉద్దీన్, తహసిల్దార్ కృష్ణయ్య, డీసీసీ జిల్లా అధ్యక్షుడు గుడిపూడి నరసయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్లు జుట్టుకొండ సత్యనారాయణ, పెరుమాళ్ల అన్నపూర్ణ, నాయకులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి