బీసీలపై వివక్ష చూపితే కాంగ్రెస్‌కు పుట్టగతులు ఉండవు..
బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపేందర్ ఆగ్రహం..
నల్గొండ : బీసీ వర్గానికి చెందిన మహిళా మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపేందర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇతర వర్గాల నాయకులకు ఒక న్యాయం, బీసీలకు మరొక న్యాయం అమలు చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కట్టెకోలు దీపేందర్ మాట్లాడుతూ.. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడం అంటే యావత్ బీసీ సమాజాన్నే అవమానించడమేనని స్పష్టం చేశారు. "ఆమె కుమార్తె ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడి ఉంటే, ఆ సమాధానం ఆమె కుమార్తె నుంచి కోరాలి. పార్టీ పరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలే తప్ప, రాజ్యాంగబద్ధమైన మంత్రి పదవి నుంచి సురేఖను తొలగించడం ఏమాత్రం సమంజసం కాదు" అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే తన నిర్ణయాన్ని పునరాలోచించుకుని, బర్తరఫ్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ అధిష్ఠానం జోక్యం చేసుకుని గౌరవప్రదమైన వాతావరణాన్ని పునరుద్ధరించాలని, లేని పక్షంలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బర్తరఫ్‌ను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, పట్టణ కార్యదర్శి ముక్కామల శ్రీనివాస్, నాయకులు జక్కలి సాయిరాం, కొడదల శంకర్, విగ్నేష్, రాజు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి