ఆరు గ్యారంటీలు.. 420 హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు.
నకిరేకల్‌లో బీఆర్‌ఎస్ మహిళా సదస్సులో చిరుమర్తి లింగయ్య ధ్వజం.
నకిరేకల్, సెప్టెంబర్ 4: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తీవ్ర అన్యాయం చేసిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నకిరేకల్ పట్టణంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా సదస్సులో ఆయన మాట్లాడారు. సుమారు 1,500 మంది మహిళలు, పార్టీ శ్రేణులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.2,500, విద్యార్థులకు స్కూటీలు, కంప్యూటర్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారని అన్నారు. వృద్ధుల పింఛన్‌ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు, వికలాంగుల పింఛన్‌ను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతామని చెప్పి మోసం చేశారని విమర్శించారు.
ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనూ పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటేనే ఇళ్లు ఇస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా చేపట్టిన అభివృద్ధి పనులు పెద్దగా లేవని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులనే కొనసాగిస్తున్నారని అన్నారు.
నకిరేకల్ పట్టణంలో రూ.36 కోట్లతో 100 పడకల ఆస్పత్రికి మాజీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధికి నిదర్శనమన్నారు. ‘అభివృద్ధి అంటే చిరుమర్తి లింగయ్య’ అనే స్థాయిలో నకిరేకల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్‌ఎస్ నాయకులు, మహిళలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి