వారం రోజులుగా వృథాగా వేల లీటర్ల తాగునీరు
శ్రీ కంఠమహేశ్వర కాలనీలో బురదమయమైన బాటలు
తీవ్ర ఇబ్బందుల్లో స్థానికులు, వాహనదారులు
పట్టించుకోని మున్సిపల్ అధికారులు
మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ కంఠమహేశ్వర కాలనీలో మంచినీటి పైప్‌లైన్ లీకేజీ స్థానికులకు నరకాన్ని చూపుతోంది. గత వారం రోజులుగా ప్రధాన పైప్‌లైన్ పగిలి వేల లీటర్ల విలువైన తాగునీరు వృథాగా రోడ్లపైకి చేరుతోంది. నీరు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో రోడ్డు కాస్తా చెరువును తలపిస్తోంది.
ఇళ్లకు అందని నీరు.. రోడ్డుపై చెరువు!
ఒకపక్క పట్టణంలో తాగునీటి ఎద్దడి నెలకొంటే, ఇక్కడ ఇలా వేల లీటర్ల నీరు వీధులపాలవ్వడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీకేజీ కారణంగా తమ ఇళ్లకు వచ్చే మంచినీటి సరఫరాలో ప్రెషర్ తగ్గడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. నిలిచిన నీటితో రోడ్డంతా బురదమయంగా మారడంతో పాఠశాలలకు వెళ్లే పిల్లలు, కాలినడకన వెళ్లేవారు అవస్థలు పడుతున్నారు. రాత్రివేళల్లో గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు జారిపడుతున్నారు. రోజుల తరబడి రోడ్డుపైనే నీరు నిల్వ ఉండటంతో దుర్వాసన వస్తోందని, దోమలు విపరీతంగా పెరిగిపోయాయని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదముందని ఆవేదన చెందుతున్నారు. వాటర్ వర్క్స్, మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పైప్‌లైన్‌కు శాశ్వత మరమ్మతులు చేపట్టి, దెబ్బతిన్న రోడ్డును పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి