కోదాడ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ, ప్రజాక్షేత్రంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా, ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసేందుకు సెప్టెంబర్ 2 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం కోదాడ నియోజకవర్గ స్థాయి నిరసన ధర్నాను బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చి, అమలు చేయని హామీలను ప్రస్తావిస్తూ రూపొందించిన “బాకీ కార్డులను” ప్రజలకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ, అధికారంలోకి రావడం కోసమే కాంగ్రెస్ పార్టీ అనేక హామీలతో కూడిన గ్యారెంటీ కార్డులను ప్రజలకు ఇచ్చిందని విమర్శించారు. ఆ హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు.రాష్ట్ర అభివృద్ధి పనులకు సంబంధించిన కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో అవినీతి జరుగుతోందని ఆయన ఆరోపించారు. కమీషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని, బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కాంట్రాక్టర్లు ఆందోళనలకు దిగుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేసిందని, వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని మల్లయ్య యాదవ్ ఆరోపించారు. మరోవైపు హైదరాబాద్‌లో భూకబ్జాలు, అవినీతి కారణంగా రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటోందని అన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.సెప్టెంబర్ 2 నుంచి 9వ తేదీ వరకు కోదాడ నియోజకవర్గంలోని గ్రామగ్రామాన నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం గులాబీ జెండా ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని బొల్లం మల్లయ్య యాదవ్ స్పష్టం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి