చిన్న వయసు నుంచే పిల్లల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించాలని ఐసీఎంఆర్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) డైరెక్టర్ డాక్టర్ భారతి కులకర్ణి సూచించారు. హైదరాబాద్ ప్రెస్ టూర్‌లో భాగంగా ఉత్తరాఖండ్‌కు చెందిన 15 మంది మీడియా ప్రతినిధులు బుధవారం
ఐసీఎంఆర్–ఎన్‌ఐఎన్‌ను సందర్శించారు.
ఈ సందర్భంగా డాక్టర్ భారతి కులకర్ణి మాట్లాడుతూ.. సమతుల ఆహారం, పోషక విలువలు, శరీరానికి అవసరమైన పోషకాలపై ఐసీఎంఆర్–ఎన్‌ఐఎన్ శాస్త్రీయ పరిశోధనలు నిర్వహిస్తోందన్నారు. ఇండియన్ ఫుడ్ కంపోజిషన్ టేబుల్స్ ద్వారా దేశీయ ఆహార పదార్థాల్లోని శక్తి, ప్రొటీన్, సూక్ష్మ పోషకాలు, ఖనిజాల వివరాలను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు.
రెండేళ్ల వరకు అదనపు చక్కెర వద్దు.
పిల్లలకు రెండేళ్ల వయసు వరకు అదనపు చక్కెర ఇవ్వకూడదని సూచించారు. అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఉన్న ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల పిల్లల్లో అధిక బరువు, ఊబకాయం పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారం అందుబాటులో ఉండటం మాత్రమే పోషక భద్రతకు సరిపోదని, వైవిధ్యమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా అవసరమని వివరించారు.
చిరుధాన్యాలపై పరిశోధనలు.
ఉత్తరాఖండ్‌లో పండించే మండు, జంగోరా, చోలై, కోడా తదితర దేశీయ పంటలు, చిరుధాన్యాల్లోని పోషక విలువలపై పరిశోధనలు కొనసాగుతున్నాయని డాక్టర్ భారతి కులకర్ణి తెలిపారు. రాగుల వినియోగం రక్తహీనత తగ్గింపుపై చూపే ప్రభావాన్ని కూడా అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పోషకాహారంపై అవగాహన కల్పించాలి.
ఐసీఎంఆర్–ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్త, ఎన్‌ఐసీహెచ్‌ఈ విభాగం అధిపతి డాక్టర్ సుబ్బారావు ఎం. గవరవరపు మీడియా ప్రతినిధులకు పోషకాహార సమాచారంపై అవగాహన కల్పించారు. పోషకాహార లోపాలు, సూక్ష్మ పోషకాల కొరతతోపాటు జీవనశైలి కారణంగా తలెత్తే ఆరోగ్య సమస్యలు ఏకకాలంలో కొనసాగుతున్నాయని వివరించారు. ప్రజలకు శాస్త్రీయ, ఆధారిత పోషకాహార సమాచారాన్ని అందించడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని సూచించారు.
.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి