కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తాం
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని భారీగా అప్పులపాలు చేశారని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి విమర్శించారు. బుధవారం సూర్యాపేటలోని విద్యానగర్‌లో తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్, రైతుభరోసా, రైతు రుణమాఫీ వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదలకు సొంతింటి కలను సాకారం చేస్తున్నామని, ఉద్యోగాల భర్తీ, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, పెన్షన్ల పెంపు వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేద రోగులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని, పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
కేసీఆర్ ప్రజా సమస్యలపై మాట్లాడారా?
మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నారని వేణారెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు తమ పదేళ్ల పాలనలో చేసిన పనులపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు కార్యక్రమాల్లో లోపాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తాయని తెలిపారు.
సమావేశంలో కౌన్సిలర్ బైరు శైలేందర్, ఎల్గూరి ఇందిర వీరయ్యగౌడ్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుందమల్ల శేఖర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ కరీం, జిల్లా కాంగ్రెస్ నాయకులు శణగాని రాంబాబు, పందిరి మల్లేష్‌గౌడ్, రమాదేవి, నకిరేకంటి వెంకన్న (కేకే), వెన్నపెందర్ నాయుడు, బాలెంల మాజీ సర్పంచ్ రామసాని రమేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి