ఇబ్రహీంపట్నం:
విద్యార్థుల హక్కులను అణిచివేస్తే సమరశీల ఉద్యమాలు నిర్మిస్తామని ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షురాలు ఐషీ ఘోష్ హెచ్చరించారు. ఇబ్రహీంపట్నం కేంద్రంలోని వైష్ణవి ఫంక్షన్ హాల్‌లో బుధవారం నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు.
విద్యావ్యవస్థను ప్రైవేటీకరిస్తూ విద్యార్థుల భవిష్యత్తును వ్యాపార వస్తువుగా మార్చే విధానాలను ఆమె తీవ్రంగా విమర్శించారు. విద్యార్థులు, యువత ఐక్యంగా పోరాడితే నిరంకుశ విధానాలను ఎదుర్కోవచ్చన్నారు. జంతర్‌మంతర్‌లో జరిగిన విద్యార్థి ఉద్యమాలు యువతలోని అసంతృప్తికి ప్రతిబింబమని పేర్కొన్నారు.
నీట్ వంటి పోటీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రోజుకు గంటల తరబడి చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తుతో జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) చెలగాటమాడటం సరికాదన్నారు. పోటీ పరీక్షల అవకతవకలు, పేపర్ లీకేజీలపై ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యకు తగిన నిధులు కేటాయించి, ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలని కోరారు. విద్యార్థులు ప్రశ్నించే హక్కును కాపాడుకోవాలని, హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కత్తి కంటే కలం పదునైనదని, విద్యార్థి శక్తితోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని అన్నారు.
కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. రజనీకాంత్, టి. నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. కిరణ్, రాష్ట్ర గర్ల్ కన్వీనర్ ఎం. మమత, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.వై. ప్రణయ్, బి. శంకర్, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు బోడ వంశీ, ఎరుప్పుల తారంగ్, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్, శ్రీకాంత్తో పాటు నాయకులు వేణు, జస్వంత్, అజయ్, సిద్దు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి