హిందూ ఐక్యతే శక్తి… నల్లగొండలో సమ్మేళనానికి శ్రీకారం
హిందూ ఐక్యతే శక్తి… నల్లగొండలో సమ్మేళనానికి శ్రీకారం
స్థానికం బృందం
కులాలకు అతీతంగా హిందూ సమైక్యతకు పిలుపు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేళ నల్లగొండలో హిందూ సమ్మేళనం ఏర్పాట్లు
నల్లగొండ: “కులం అనేది గడపలోపల మాత్రమే ఉండాలి.. బయటకు వస్తే మనమంతా హిందువులమే అనే భావన ప్రతి ఒక్కరిలో కలగాలి” అని ఆర్ఎస్ఎస్ విభాగ్ సహసంఘ చాలక్ ఇటిక్యాల కృష్ణయ్య పిలుపునిచ్చారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనాల భాగంగా శుక్రవారం నల్లగొండలోని గాంధీనగర్ హనుమాన్ దేవాలయంలో కమిటీ సభ్యులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హిందూ సమ్మేళన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో హిందూ సమాజం ఐక్యంగా ఉండటం అత్యవసరమని అన్నారు. సమాజంలో హిందువులపై, దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటే సంఘటిత శక్తి అవసరమని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రస్థానంలో ఇప్పటివరకు 10 కోట్ల మందిని ఐక్యం చేయగలిగామని తెలిపారు.
నల్లగొండలోని శివాజీ పార్క్‌లో నిర్వహించనున్న భారీ హిందూ సమ్మేళనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి శ్రీశైలం శ్రీ సిద్ధ ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శ్రీనివాసానంద స్వామి మహారాజ్ హాజరవుతారని వెల్లడించారు. ప్రతి హిందూ కుటుంబం తమ ఇంటి సభ్యులతో కలిసి ఈ సమ్మేళనంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
హిందూ ధర్మ రక్షణే లక్ష్యంగా సాగే ఈ సమ్మేళనం చారిత్రాత్మక ఘట్టంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళనం కమిటీ అధ్యక్షుడు బెల్లి నాగరాజు, ఉపాధ్యక్షులు వారణాసి రజనీకాంత్ శర్మ, మందడి పుష్పలత, పెద్దిరెడ్డి మనోజ్, జగిని శరత్ బాబు, బొడ్డు తిరుపతయ్య, మల్లెబోయిన సతీష్, సంకటి వీరేష్, పిల్లి కృష్ణ, తేలు సైదులు, తోగోటి రమేష్, గుంటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి