ఏఐతోనే భారత భవిష్యత్': కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
ఏఐతోనే భారత భవిష్యత్': కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
Editor Desk
సాఫ్ట్‌వేర్ సేవల నుంచి 'ఏఐ యాజ్ ఎ సర్వీస్' వైపు ఐటీ రంగం అడుగులు వేయాలి.
హైదరాబాద్ దేశానికి సెమీకండక్టర్లు, ఏఐ, డిజిటల్ ఇన్నోవేషన్ రాజధానిగా ఎదుగుతుంది: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచ ఐటీ రంగాన్ని పూర్తిగా మార్చేసిందని, ఈ మార్పును అందిపుచ్చుకుని భారత ఐటీ పరిశ్రమ ఇకపై 'సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్' నుంచి 'ఏఐ యాజ్ ఎ సర్వీస్' దిశగా పయనించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, రైల్వేలు, సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్న 'వికసిత్ భారత్–2047' సాధనలో హైదరాబాద్ కీలక భూమిక పోషించబోతోందని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో హైసియా నిర్వహించిన 'వికసిత్
భారత్–2047 నిర్మాణంలో సాంకేతికత పాత్ర' అంశంపై జరిగిన ఇండస్ట్రీ లీడర్స్ టౌన్‌హాల్‌లో మంత్రి మాట్లాడారు. దేశ భవిష్యత్ అభివృద్ధి ఏఐ, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల చుట్టూనే తిరుగుతుందని పేర్కొన్నారు.
దేశంలో 12 సెమీకండక్టర్ ప్లాంట్లు
భారత్ ఎన్నో దశాబ్దాలుగా కలలుగన్న సెమీకండక్టర్ తయారీ రంగం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 సెమీకండక్టర్ తయారీ ప్లాంట్లు అభివృద్ధి దశలో ఉండగా, వాటిలో మూడు ఇప్పటికే చిప్‌ల ఉత్పత్తి ప్రారంభించి జపాన్, యూరప్‌తో పాటు దేశీయ మార్కెట్లకు సరఫరా చేస్తున్నాయని తెలిపారు. సెమీకండక్టర్ రంగానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు 315 విశ్వవిద్యాలయాలకు ఆధునిక డిజైన్ టూల్స్ అందించినట్లు వెల్లడించారు.
హైదరాబాద్‌కు మూడు బుల్లెట్ రైలు కారిడార్లు
హైదరాబాద్‌ను దేశంలో అత్యంత కీలక సాంకేతిక, పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మూడు బుల్లెట్ రైలు కారిడార్లు ప్రతిపాదించామని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం వేగంగా విస్తరిస్తోందని, కేంద్రం సహకారంతో 104 ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు, నాలుగు ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటయ్యాయని తెలిపారు.
తెలంగాణకు రూ.5,400 కోట్ల రైల్వే నిధులు.
రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి ఏటా రూ.5,400 కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నామని, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణలో సుమారు 40 రైల్వే స్టేషన్లు ఆధునీకరణ జరుగుతోందని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి హైదరాబాద్‌కే పరిమితం కాకుండా వరంగల్, కరీంనగర్ వంటి నగరాలకు విస్తరించాలని సూచించారు. అనంతరం ఇద్దరు కేంద్ర మంత్రులు కొండకల్‌లోని మేధ బోగీస్ ఫ్యాక్టరీ, ఫ్యాబ్‌సిటీలోని మేధ సర్వో డ్రైవ్స్ పరిశ్రమలను సందర్శించి తయారీ, సాంకేతిక సామర్థ్యాలను పరిశీలించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి