విద్యార్థినులతో చపాతీలు చేయిస్తున్నారంటూ SFI ఆగ్రహం.
దామరచర్ల బీసీ బాలికల గురుకులంలో తనిఖీ.. కలెక్టర్ స్పందించాలని డిమాండ్
మిర్యాలగూడ: బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులతో చపాతీలు చేయిస్తున్నారని భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) మిర్యాలగూడ డివిజన్ కమిటీ ఆరోపించింది. శ్రీనివాస్‌నగర్‌లోని దామరచర్ల బీసీ బాలికల గురుకుల పాఠశాలను ఆదివారం SFI నాయకులు సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా SFI నాయకుడు మూడవత్ జగన్‌నాయక్ మాట్లాడుతూ.. పాఠశాల గేటు వద్దకు వెళ్లే సరికి సుమారు 30 మంది విద్యార్థినులతో బయట టేబుళ్లు ఏర్పాటు చేసి చపాతీలు చేయిస్తున్న దృశ్యం కనిపించిందన్నారు. ఉన్నత చదువులు చదివించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకులంలో చేర్పిస్తే.. విద్యార్థినులతో వంట పనులు చేయించడం ఏమిటని ప్రశ్నించారు.
ప్రతి ఆదివారం ఒక్కో తరగతి విద్యార్థినులతో పూరీల కోసం చపాతీలు చేయిస్తున్నారని, సుమారు 500 మంది విద్యార్థులకు సరిపడా ఆహారం తయారు చేయాల్సి వస్తోందని ఆరోపించారు. ప్రిన్సిపాల్, బీసీ గురుకులాల RCO తమ పిల్లలతోనూ ఇలాగే పనులు చేయిస్తారా అని ప్రశ్నించారు. చదువుకోవడానికి వచ్చిన బాలికలను హోటల్‌లో పనిచేసే వారి మాదిరిగా మార్చడం దుర్మార్గమని విమర్శించారు.
దామరచర్ల గురుకులంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక సమస్యపై వార్తలు వస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థుల సమస్యలపై బీసీ గురుకులాల సెక్రటరీ, జిల్లా RCOలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. వెంటనే నల్లగొండ జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
బాలుర గురుకులంలో పూరీ బంద్‌పై ప్రశ్నలు.
నాగార్జున కళాశాలలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలలో ఆగస్టు 15న లడ్డూలు ఇచ్చారని, అనంతరం ఆదివారం ఉదయం విద్యార్థులకు పూరీ టిఫిన్ ఇవ్వలేదని SFI నాయకులు ఆరోపించారు. పూరీ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించగా.. మెస్ ఛార్జీలు సరిపోవడం లేదని, RCO సూచనల మేరకు ఆదివారం ఉదయం పూరీ బంద్ చేసినట్లు సిబ్బంది తెలిపారని పేర్కొన్నారు.
నల్లగొండ జిల్లాలోని బీసీ గురుకులాల్లో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న జిల్లా RCOను వెంటనే తొలగించాలని జగన్‌నాయక్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా బలమైన సమరశీల పోరాటాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో SFI నాయకులు ఝాన్సీ, వెంకటేశ్వర్లు, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి