ఎన్టీఆర్ విగ్రహం దహనం విద్వేషాల రెచ్చగొట్టే కుట్ర భగ్నం!
ఎన్టీఆర్ విగ్రహం దహనం విద్వేషాల రెచ్చగొట్టే కుట్ర భగ్నం!
NM Yadav
నల్లగొండలో సామాజిక ఉద్రిక్తతలకు స్కెచ్..
ఇద్దరు నిందితుల అరెస్ట్, కారు స్వాధీనం..
సీసీటీవీ ఆధారాలతో కేసు ఛేదించిన పోలీసులు..
నల్లగొండ : ప్రజల మధ్య ప్రాంతీయ, సామాజిక విద్వేషాలను రెచ్చగొట్టి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే లక్ష్యంతో జరిగిన ఒక భారీ కుట్రను నల్లగొండ జిల్లా పోలీసులు భగ్నం చేశారు. నల్లగొండ పట్టణంలో సంచలనం సృష్టించిన మాజీ ముఖ్యమంత్రి, సినీ మహామహుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహం దహనం కేసును టూ టౌన్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి ఒక బలెనో కారు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే..?
జూన్ 6వ తేదీ తెల్లవారుజామున నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న ఎన్.జి. కళాశాల సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. రాజకీయ, సామాజిక వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. మున్సిపల్ 48వ వార్డు అధికారి బుజనూరి స్వప్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నం. 232/2026 కింద బీఎన్ఎస్ (BNS) సెక్షన్లు 326(F), 196, 126(2), 324(4), 292 మరియు పీడీపీపీ (PDPP Act-1984) చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
నిందితుల వివరాలు...పాలకురి అశోక్ కుమార్ గౌడ్ (45) ప్రైవేట్ లెక్చరర్, నివాసం, చైతన్యపురి, హైదరాబాద్. (ప్రధాన సూత్రధారి),ఎలుకంటి ప్రణీత్ (23): ప్రైవేట్ ఉద్యోగి, నివాసం, మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా. జూన్ 6వ తేదీ తెల్లవారుజామున సుమారు 3:45 గంటల సమయంలో నిందితులు అశోక్ కుమార్ గౌడ్‌కు చెందిన బలెనో కారు (TS-07-HT-2430)లో నల్లగొండకు చేరుకున్నారు. తాము ముందస్తుగా తెచ్చుకున్న రెండు పాత బెడ్‌షీట్లను ఎన్టీఆర్ విగ్రహంపై కప్పి, లీటరు పెట్రోల్ పోసి నిప్పంటించారు. విగ్రహం తగులబడుతుండగానే అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు. కేవలం నల్లగొండలోనే కాకుండా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలను లక్ష్యంగా చేసుకుని వరుసగా ధ్వంసం చేయాలని, తద్వారా ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు, ఉద్రిక్తతలు సృష్టించాలని వారు పెద్ద కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ వ్యూహంలో భాగంగానే మొదటి ప్రయత్నంగా నల్లగొండలోని విగ్రహాన్ని ఎంచుకుని, ముందస్తుగా రెక్కీ నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు.
వందలాది గంటల సీసీటీవీ ఫుటేజీల పరిశీలన..
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు డీఎస్పీ కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో సీసీఎస్, టూ టౌన్ పోలీసులతో ప్రత్యేక దర్యాప్తు బృందాలను రంగంలోకి దించారు. సంఘటనా స్థలం పరిసరాల్లోని వందలాది గంటల సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. సాంకేతిక ఆధారాలు, అనుమానాస్పద వాహనాల కదలికలను విశ్లేషించి నిందితులను పట్టుకున్నారు. డిజిటల్ ఆధారాల ద్వారా నిందితుల నేరాన్ని పోలీసులు పక్కాగా నిర్ధారించారు.
ఉపేక్షించేది లేదు - ఎస్పీ హెచ్చరిక..
సమాజంలో శాంతిసామరస్యాలను దెబ్బతీయాలని చూసే శక్తులను, ప్రజా ఆస్తులను ధ్వంసం చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పష్టం చేశారు. సోషల్ media, క్షేత్రస్థాయిలో ఇలాంటి కుట్రలపై నిరంతర నిఘా ఉంటుందని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన డీఎస్పీ కె. శివరాం రెడ్డి, టూ టౌన్ సీఐ ఎస్. రాఘవరావు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు డి. చంద్రశేఖర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, రూరల్ ఎస్ఐ డి. సైదాబాబు, హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరి మరియు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటించారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి