ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు
ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
73 మంది విశిష్టులకు పురస్కారాలు.. తెలంగాణ నుంచి ఆరుగురికి అవకాశం.. నల్గొండ జిల్లా ఘనత దేశవ్యాప్తంగా మార్మోగింది
దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను సత్కరిస్తూ మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి కార్యక్రమం ఉమ్మడి నల్గొండ జిల్లాకు అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 73 మంది విశిష్ట వ్యక్తులకు శనివారం ఢిల్లీలో గౌరవ డాక్టరేట్‌లు (Honoris Causa) ప్రదానం చేయగా, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఆరుగురిలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు చోటు దక్కించుకోవడం ప్రత్యేకతగా నిలిచింది. ఒకరు ఐటీ రంగంలో తన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన యువ పారిశ్రామికవేత్త కాగా, మరొకరు ప్రజా సమస్యల పరిష్కారానికి జీవితాన్ని అంకితం చేసిన సీనియర్ జర్నలిస్టు, సామాజిక సేవకుడు కావడం జిల్లావాసులకు మరింత గర్వకారణంగా మారింది.
ఐటీ రంగంలో వెలుగొందిన వేలిమినేడు యువకుడు: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన అంతటి చాణిక్య మధు కిరణ్ గౌడ్ ఐటీ రంగంలో తనదైన ముద్ర వేసి ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. బీటెక్, ఎంబీఏ విద్యను పూర్తి చేసిన ఆయన తన వృత్తి జీవితాన్ని ఐటీ రిక్రూటర్‌గా ప్రారంభించారు. రిలయ్ ఐటీ సొల్యూషన్స్‌లో తొలి అడుగులు వేసిన ఆయన, అనంతరం బోస్టన్‌లాజిక్స్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు.
తరువాత సంస్థల నిర్వహణలో అనుభవాన్ని పెంపొందించుకుంటూ కొత్త టెక్నాలజీలపై తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న ఆయన, ప్రస్తుతం ‘కాన్సిటో మైండ్ సొల్యూషన్స్’ సంస్థను స్థాపించి వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. ఐటీ సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ రంగంలో అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగానే మ్యాజిక్ అండ్ ఆర్ట్స్ యూనివర్సిటీ, మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశాయి.
లారీ క్లీనర్ నుంచి గౌరవ డాక్టర్ వరకు.. మల్లేశం గౌడ్ స్ఫూర్తిదాయక ప్రయాణం: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు, సీనియర్ జర్నలిస్టు, ‘స్థానికం’ పత్రిక వ్యవస్థాపకుడు డాక్టర్ కొండ మల్లేశం గౌడ్‌కు కూడా ఇదే వేదికపై గౌరవ డాక్టరేట్ లభించింది.
లారీ క్లీనర్‌గా ప్రారంభమైన ఆయన జీవన ప్రస్థానం అనేక కష్టాలను అధిగమిస్తూ జర్నలిస్టుగా, సామాజిక సేవకుడిగా, పత్రికా వ్యవస్థాపకుడిగా ఎదిగింది. డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తూనే ఎం.ఏ. పొలిటికల్ సైన్స్, ఎం.ఏ. మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పట్టాలను సంపాదించారు. జై గౌడ, ప్రజా కలం, లోకల్ టైమ్స్, తేజా టీవీ, సుదినం వంటి పలు మీడియా సంస్థల్లో పనిచేసిన అనంతరం ప్రజల సమస్యలకు అద్దం పట్టే లక్ష్యంతో ‘స్థానికం’ పత్రికను స్థాపించారు.
తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడంతో పాటు, 49 మంది యువకులకు డ్రైవింగ్ శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించారు. “చదువు–వెలుగు” కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులకు విద్యాబోధన, ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ, సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు న్యాయం అందించేందుకు చేసిన కృషి ఆయనకు ఈ అరుదైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది.
కుటుంబ సభ్యులకే ఘనత అంకితం చేసిన చాణిక్య మధు: ఈ గౌరవం తన ఒక్కడి కృషి ఫలితం కాదని, తల్లిదండ్రులు అంతటి ఆది మల్లేష్ గౌడ్, లలితల ప్రోత్సాహం, క్రమశిక్షణ తనను ఈ స్థాయికి చేర్చాయని డాక్టర్ అంతటి చాణిక్య మధు కిరణ్ గౌడ్ పేర్కొన్నారు. అలాగే తన చెల్లెలు గోధా మైత్రి, బావ రంజిత్ దంపతులకు, తనకు అత్యంత ఆప్తులైన సుభిక్ష వర్ధిని, నిక్షిత్ శివకృత్ వర్ధన్‌లకు ఈ ఘనతను అంకితం చేస్తున్నట్లు భావోద్వేగంతో తెలిపారు.
దేశవ్యాప్తంగా 73 మందికి గౌరవం.. తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు: దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎంపికైన 73 మంది ప్రముఖులకు ఒకే వేదికపై గౌరవ డాక్టరేట్‌లు ప్రదానం చేయడం విశేషంగా నిలిచింది. సామాజిక సేవ, విద్య, వైద్యం, సాహిత్యం, సాంకేతిక రంగం, ప్రజాసేవ వంటి విభాగాల్లో విశేష కృషి చేసిన వారిని ఎంపిక చేసి ఈ పురస్కారాలను అందజేశారు.
ఉత్తరాఖండ్ నుంచి అత్యధికంగా 11 మంది, పశ్చిమ బెంగాల్ నుంచి 8 మంది, మహారాష్ట్ర నుంచి 7 మంది, ఛత్తీస్‌గఢ్ నుంచి 6 మంది ఎంపిక కాగా, తెలంగాణ రాష్ట్రం నుంచి ఆరుగురికి ఈ అరుదైన గౌరవం దక్కింది. వారిలో ఇద్దరు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినవారు కావడం జిల్లా ప్రజలకు గర్వకారణంగా మారింది.
జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు: ఒకే కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు గౌరవ డాక్టరేట్‌లను అందుకోవడం జిల్లాకు ప్రతిష్ఠను తెచ్చిపెట్టిందని పలువురు ప్రజాప్రతినిధులు, ఐటీ నిపుణులు, జర్నలిస్టులు, సామాజిక సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎదిగి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ ఇద్దరు వ్యక్తుల విజయగాథలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
సాధారణ కుటుంబాల నుంచి వచ్చి కష్టాన్ని ఆయుధంగా మార్చుకుని, తమ తమ రంగాల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించిన డాక్టర్ అంతటి చాణిక్య మధు కిరణ్ గౌడ్, డాక్టర్ కొండ మల్లేశం గౌడ్‌లు ఉమ్మడి నల్గొండ జిల్లాకు జాతీయ స్థాయిలో కొత్త గుర్తింపును తీసుకువచ్చారని జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి