ఖాదీకి కొత్త ఊపు.. రూ.1.87 లక్షల కోట్ల అమ్మకాలు.
ఖాదీకి కొత్త ఊపు.. రూ.1.87 లక్షల కోట్ల అమ్మకాలు.
Editor Desk
ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల రంగం 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేసింది. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల అమ్మకాలు తొలిసారిగా రూ.1.87 లక్షల కోట్ల మార్క్‌ను దాటినట్లు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) వెల్లడించింది. న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్ గాంధీ దర్శన్‌లో మంగళవారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక గణాంకాలను KVIC ఛైర్మన్ మనోజ్ కుమార్ విడుదల చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘వోకల్ ఫర్ లోకల్’, ‘లోకల్ టు గ్లోబల్’ కార్యక్రమాల ప్రభావంతో ఖాదీ రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తినిచ్చిందని ఆయన పేర్కొన్నారు. 2013-14తో పోలిస్తే గత 12 ఏళ్లలో అమ్మకాలు 501 శాతం, ఉత్పత్తి 380 శాతం, ఉపాధి 56 శాతం పెరిగినట్లు తెలిపారు.
2013-14లో రూ.31,154 కోట్లుగా ఉన్న అమ్మకాలు 2025-26లో రూ.1,87,105 కోట్లకు చేరగా, ఉత్పత్తి విలువ రూ.26,109 కోట్ల నుంచి రూ.1,25,296 కోట్లకు పెరిగిందన్నారు. ఖాదీ వస్త్రాల అమ్మకాలు రూ.1,081 కోట్ల నుంచి రూ.7,869 కోట్లకు పెరిగి 628 శాతం వృద్ధి నమోదు చేశాయని చెప్పారు.
గ్రామీణ పరిశ్రమల రంగంలో ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరిగినట్లు తెలిపారు. 2013-14లో 1.30 కోట్లుగా ఉన్న ఉపాధి 2025-26లో 2.04 కోట్లకు చేరిందన్నారు. PMEGP పథకం కింద ఈ ఏడాది 66,494 కొత్త యూనిట్లు స్థాపించగా, వాటి ద్వారా 7.31 లక్షల మందికి ఉపాధి లభించినట్లు వెల్లడించారు.
గ్రామోద్యోగ వికాస్ యోజన కింద కళాకారులకు పెద్ద ఎత్తున యంత్రాలు, టూల్‌కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. మహిళా సాధికారతలో భాగంగా శిక్షణ కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యం 59 శాతానికి చేరిందన్నారు.
కళాకారుల పారితోషికం ఒక్క హ్యాంక్‌కు రూ.4 నుంచి రూ.15కు పెరిగి 275 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. ప్రభుత్వ కొనుగోళ్లు, ప్రదర్శనల అమ్మకాలు, జాతీయ జెండాల డిమాండ్ పెరగడం ఖాదీపై ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి