తెలంగాణ పోలీస్ క్రీడలకు ఘన శ్రీకారం. మల్కాజిగిరి కమిషనరేట్‌లో 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్–2026 ప్రారంభం.
తెలంగాణ పోలీస్ క్రీడలకు ఘన శ్రీకారం. మల్కాజిగిరి కమిషనరేట్‌లో 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్–2026 ప్రారంభం.
Editor Desk
క్రీడలు ధ్యానం లాంటివి.. పోలీసుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి' – డీజీపీ సి.వి. ఆనంద్.
తెలంగాణ పోలీసు సిబ్బందిలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, పోటీతత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026కు బుధవారం ఘనంగా శ్రీకారం చుట్టారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైన క్లస్టర్–ఏ పోటీలను రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ సి.వి. ఆనంద్ క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీజీపీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ..
రాష్ట్ర పోలీసు శాఖలో క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేసేందుకు ఈ ఏడాది నుంచి తెలంగాణ పోలీస్ గేమ్స్‌ను క్లస్టర్ విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ మంది పోలీసు సిబ్బందికి పోటీల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందన్నారు.
"క్రీడలు ధ్యానం లాంటివి. అవి ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను పెంపొందిస్తాయి. శారీరక దృఢత్వంతో పాటు విధి నిర్వహణలో సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. పోలీసింగ్, క్రీడలు రెండింటికీ క్రమశిక్షణ, సహనం, అంకితభావం అత్యంత కీలకం" అని డీజీపీ పేర్కొన్నారు.
.మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి మాట్లాడుతూ..
తెలంగాణ పోలీస్ గేమ్స్ కేవలం క్రీడా పోటీలు మాత్రమే కాకుండా పోలీసు విభాగంలో జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, శారీరక సామర్థ్యాన్ని పెంపొందించే వేదికగా నిలుస్తాయని అన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని తెలిపారు.
ఐజీ (పి&ఎల్ అండ్ స్పోర్ట్స్) డా. గజరావు భూపాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈసారి క్లస్టర్–ఏ పోటీల్లో రాష్ట్రంలోని 21 పోలీసు యూనిట్లకు చెందిన 831 మంది పోలీసు సిబ్బంది (683 మంది పురుషులు, 148 మంది మహిళలు) పాల్గొంటున్నారు. రెజ్లింగ్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, పవర్‌లిఫ్టింగ్, యోగా, జూడో, వుషూ, తైక్వాండో, కరాటే, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్ తదితర 14 ఇండోర్ క్రీడాంశాల్లో రెండు రోజుల పాటు పోటీలు నిర్వహించనున్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ మాట్లాడుతూ..
క్రీడలు ప్రతి పోలీసు అధికారిలో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
సినీ నటుడు నవీన్ పోలిశెట్టి తెలంగాణ పోలీసుల సేవలను కొనియాడుతూ..
సమాజ భద్రత కోసం నిరంతరం శ్రమించే పోలీసులే నిజమైన హీరోలని అన్నారు.
జూలై 8, 9 తేదీల్లో జరిగే ఈ క్రీడల ద్వారా పోలీసు సిబ్బందిలో ఫిట్‌నెస్, జట్టు స్ఫూర్తి, పోటీతత్వం, వృత్తి నైపుణ్యాలు మరింత పెంపొందుతాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు, వివిధ కమిషనరేట్లు, జిల్లాల పోలీసు అధికారులు, క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి