చౌటుప్పల్‌లో విషాదం.. ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో గురువారం చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట మండలం ఎల్కారం గ్రామానికి చెందిన మొదల రవి, పావని (22) దంపతులు జీవనోపాధి నిమిత్తం చౌటుప్పల్ పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు హేమంత్ (18 నెలలు) ఉన్నారు. కాగా, ఈ ఏడాది ఆగస్టు 9న బాలుడు హేమంత్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నాఫ్తలీన్ గోలీలు (కలరా ఉండలు) మింగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 15 రోజుల క్రితం మృతిచెందాడు.అప్పటి నుంచి పావని తన కుమారుడి మరణాన్ని తలుచుకుంటూ తీవ్ర మనస్తాపంతో కుమిలిపోతోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం 8:30 గంటల సమయంలో భర్త రవి కూరగాయలు తెచ్చేందుకు మార్కెట్‌కు వెళ్లగా.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఊయల కోసం కట్టిన చీరకు పావని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి రావుల సైదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి