సదాశివపేట మండల పరిధిలోని నిజాంపూర్ కాలనీ ప్రాథమిక పాఠశాలను గురువారం మండల విద్యాధికారి శంకర్ సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లో ఉపాధ్యాయులు బోధిస్తున్న విధానాన్ని, బోధనాభ్యసన సామగ్రి వినియోగాన్ని పరిశీలించారు. ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞాన కార్యక్రమంలో భాగంగా తెలుగు, గణితంలో విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. అనంతరం పాఠశాల రికార్డులు, గ్రంథాలయం, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, మరుగుదొడ్ల నిర్వహణ, పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. గత సంవత్సరం 90 శాతానికి పైగా హాజరు సాధించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్న మూడో తరగతి విద్యార్థిని చిట్కుల అనుదీప్తిని అభినందించారు. అలాగే జాతీయ విద్యార్థుల పర్యావరణ పోటీ-2026లో పాల్గొని ప్రాథమిక పాఠశాలల విభాగంలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రామకృష్ణతో పాటు విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ శంకర్ మాట్లాడుతూ పాఠశాలలో ఉపాధ్యాయులు కృత్యాధార బోధనను చక్కగా నిర్వహిస్తున్నారని, విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తున్నారని ప్రశంసించారు. పాఠశాల పొగాకు రహిత విద్యాసంస్థగా కొనసాగడంతో పాటు వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రత విషయంలోనూ ఆదర్శంగా ఉందని పేర్కొన్నారు. నవంబర్ నెలలో ఇప్పటివరకు విద్యార్థుల హాజరు 99 శాతంగా నమోదవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రధానోపాధ్యాయులు రామకృష్ణతో పాటు ఉపాధ్యాయులను అభినందించారు.
నిజాంపూర్ పాఠశాలలో 99 శాతం హాజరు.. ఉపాధ్యాయులకు ఎంఈఓ అభినందనలు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి