తమ అక్రమాలకు అడ్డు వస్తాడనే వెనక్కి వెళ్లగొట్టారా.?
తమ అక్రమాలకు అడ్డు వస్తాడనే వెనక్కి వెళ్లగొట్టారా.?
NM Yadav
నల్గొండ జిల్లా వైద్యశాఖలో ఏం జరుగుతోంది..
బాధ్యతలు స్వీకరించిన రెండో రోజే వెనక్కి వెళ్లిన ఇంచార్జి డీఎంహెచ్ఓ చంద్రశేఖర్..
ఆ సీనియర్ అధికారి రాజకీయ పలుకుబడితోనేనా.?
నిబంధనలకు విరుద్ధంగా అసిస్టెంట్ సివిల్ సర్జన్‌కు ఇన్ఛార్జ్ బాధ్యతలు.?
నల్గొండ : నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఒక ఉన్నతాధికారి బాధ్యతలు చేపట్టిన రెండో రోజే ఇక్కడి నుంచి తిరిగి వెనక్కి వెళ్లిపోవడం వెనుక పెద్ద ఎత్తున రాజకీయ ఒత్తిళ్లు, శాఖలోని అంతర్గత విభేదాలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 'ఆయన ఇక్కడ ఉంటే తమ ఆటలు సాగవు' అని భావించిన కొందరు ప్రభావవంతమైన వ్యక్తులు వ్యూహాత్మకంగా వ్యవహరించి సదరు అధికారిని సాగనంపినట్లు జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది.
కమిషనరేట్ ఉత్తర్వులతో వచ్చారు.. కానీ!
గతంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) గా పనిచేసిన డాక్టర్ పుట్ల శ్రీనివాస్ బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో హైదరాబాద్ ఎల్బీనగర్‌లో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ చంద్రశేఖర్‌ను నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ అధికారిగా నియమిస్తూ కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఆయన నాలుగు రోజుల క్రితం నల్గొండకు చేరుకుని జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అయితే, సాంకేతిక కారణాల వల్ల అదే రోజున ఆయన విధుల్లో చేరడానికి వీలు పడలేదు. ఆ తర్వాత సోమవారం నాడు కలెక్టర్‌ను అధికారికంగా కలిసి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించి రిజిస్టర్‌లో సంతకం చేశారు. విధుల్లో చేరిన వెంటనే సిబ్బందితో సమావేశమై సమయపాలన పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అదే రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే (ప్రజావాణి) కార్యక్రమంలోనూ ఆయన చురుగ్గా పాల్గొన్నారు.
రెండో రోజే 'తిరుగు ముఖం' వెనుక ఎవరు.?
సరిగ్గా విధుల్లో చేరిన మరుసటి రోజు.. అంటే మంగళవారం సాయంత్రానికే సీన్ రివర్స్ అయింది. డాక్టర్ చంద్రశేఖర్‌ను జిల్లా నుంచి బదిలీ చేస్తూ ఉత్తర్వులు రావడంతో ఆయన ఇక్కడి నుంచి తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. ఒక జిల్లా స్థాయి అధికారి విధుల్లో చేరిన రెండో రోజే వెనక్కి వెళ్లిపోవడం వెనుక డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఓ సీనియర్ అధికారి హస్తం ఉన్నట్లు బలమైన ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధితో సదరు సీనియర్ అధికారికి ఉన్న అనుబంధం, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి డాక్టర్ చంద్రశేఖర్‌ను ఇక్కడి నుంచి పంపించేశారనే చర్చ జోరుగా నడుస్తోంది. గతంలో సూర్యాపేట జిల్లాలో పనిచేసిన సమయంలో డాక్టర్ చంద్రశేఖర్ వైద్యశాఖను నిబంధనల ప్రకారం కఠినంగా నడిపించారు. నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పల్లెటివ్ కేర్ ఉద్యోగాల ను అక్రమంగా అమ్ముకున్న అధికారులపై విచారణ కూడా ఈయనే చేశారు. నిబంధనల ప్రకారం పనిచేసే ఈలాంటి అధికారి ఇక్కడ ఉంటే తమ అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావించిన కొందరు, ఒకే ఒక్క రోజులో ఆయనను పంపించేలా చక్రం తిప్పినట్లు కార్యాలయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
నిబంధనలకు విరుద్ధంగా ఇన్ఛార్జ్ నియామకం.?
ఇదిలా ఉండగా, మంగళవారం సాయంత్రం దేవరకొండ డిప్యూటీ డీఎంహెచ్ఓగా ఉన్న డాక్టర్ రాహుల్ జిల్లా ఇన్ఛార్జ్ డీఎంహెచ్ఓగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఈ నియామకంపై వైద్యశాఖలోని సీనియర్ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) లేదా ఇన్ఛార్జ్ డీఎంహెచ్ఓగా బాధ్యతలు అప్పగించాలంటే సదరు అధికారికి 'సివిల్ సర్జన్' అర్హత ఉండాలి. కానీ, ప్రస్తుతం బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రాహుల్ కేవలం 'అసిస్టెంట్ సివిల్ సర్జన్' మాత్రమేనని సమాచారం. అసిస్టెంట్ సివిల్ సర్జన్ హోదాలో ఉన్న వ్యక్తికి జిల్లా ఇన్ఛార్జ్ అధికారిగా బాధ్యతలు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని, సీనియర్లను పక్కనబెట్టి జూనియర్లకు బాధ్యతలు కట్టబెట్టడం వెనుక అసలు అంతర్యం ఏమిటని వైద్యశాఖ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కార్యాలయంలోని ఆ అధికారి అక్రమ ప్రయోజనాల కోసం జిల్లా వైద్యశాఖను భ్రష్టు పట్టిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి