బండ రామారం జెడ్ పి హెచ్ ఎస్ హెడ్ మాస్టర్ సస్పెండ్
బండ రామారం జెడ్ పి హెచ్ ఎస్ హెడ్ మాస్టర్ సస్పెండ్
Bandi Kiran Kumar
తుంగతుర్తి మండలంలోని బండరామారం జడ్పీహెచ్‌ఎస్(జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల)లో చోటుచేసుకున్న ఘటన జిల్లా విద్యాశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.పాఠశాలలో కొంతకాలంగా కొనసాగుతున్న ఉపాధ్యాయుల మధ్య విభేదాలు చివరకు విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు సీరియస్‌గా స్పందించారు. పాఠశాలలో హెడ్‌మాస్టర్ హకీమ్‌తో పాటు కొందరు ఉపాధ్యాయుల మధ్య కొంతకాలంగా పరిపాలన, విధుల నిర్వహణకు సంబంధించిన విభేదాలు కొనసాగుతున్నాయి.
ఈ అంతర్గత వివాదాలు పాఠశాల విద్యా వాతావరణాన్ని దెబ్బతీయడమే కాకుండా, విద్యార్థుల చదువుల పై కూడా ప్రతికూల ప్రభావం చూపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో హెడ్‌మాస్టర్ హకీమ్ అత్యంత వివాదాస్పద నిర్ణయం తీసుకుని పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు (టీసీలు) జారీ చేసినట్లు సమాచారం..ఉపాధ్యాయుల మధ్య నెలకొన్న వివాదాన్ని విద్యార్థులపై చూపించడం ఏమిటని తల్లిదండ్రులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుగా హెడ్‌మాస్టర్ వ్యవహరించారని వారు విమర్శిస్తున్నారు. విషయం జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) అశోక్ దృష్టికి చేరడంతో ఆయన వెంటనే విచారణకు ఆదేశించారు. ప్రాథమిక విచారణలో హెడ్‌మాస్టర్ చర్యలు విధి విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించిన డీఈఓ అశోక్, హెడ్‌మాస్టర్ హకీమ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అంతేకాకుండా, పాఠశాలలో నెలకొన్న పరిస్థితులకు బాధ్యత వహించాల్సిన నలుగురు ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమం, విద్యా బోధనకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డీఈఓ స్పష్టం చేసినట్లు తెలిసింది.ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. విద్యార్థుల భవిష్యత్తుతో సంబంధం ఉన్న ఇలాంటి నిర్ణయాలు పునరావృతం కాకుండా విద్యా శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు కోరుతున్నారూ. బండరామారం జడ్పీహెచ్‌ఎస్‌లో సాధారణ విద్యా బోధనను త్వరితగతిన పునరుద్ధరించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి