రూ.7 వేల జరిమానా బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం...
తీర్పు వెలువరించిన నల్గొండ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు...
అభినందించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్...
నల్గొండ : మైనర్ బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.7,000 జరిమానా విధిస్తూ నల్గొండ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఒక ప్రకటనలో వెల్లడించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నానికి చెందిన మహమ్మద్ జాఖీర్ బాబా (20) అనే వ్యక్తి 2020లో మిర్యాలగూడ II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు క్రైమ్ నంబర్ 97/2020 ద్వారా ఐపీసీ సెక్షన్లు 448, 366, 376(2)(i) మరియు పోక్సో (POCSO) చట్టంలోని సెక్షన్ 3, 4 కింద కేసు నమోదు చేశారు.
దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ సమర్పించిన పక్కా ఆధారాలను, సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు.. నిందితుడిపై నేరం రుజువైనట్లు నిర్ధారించింది. అపహరణ (IPC 366) 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2,000 జరిమానా. జరిమానా చెల్లించకపోతే అదనంగా 3 నెలల సాధారణ జైలు శిక్ష, పోక్సో చట్టం (Section 3 & 4), 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5,000 జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 6 నెలల కఠిన శిక్ష. పోక్సో చట్టంలోని సెక్షన్ 42 ప్రకారం.. ఐపీసీ, పోక్సో చట్టాల కింద పడిన శిక్షల్లో గరిష్ఠ శిక్ష అమలు కావాల్సి ఉండటంతో పాటు, అన్ని శిక్షలు ఏకకాలంలో వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది. దీంతో నిందితుడు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. బాధితురాలికి రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
పోలీస్ యంత్రాంగానికి అభినందనలు...
ఈ కేసులో పక్కా ఆధారాలు సేకరించి సమర్థవంతంగా దర్యాప్తు జరిపిన నాటి మిర్యాలగూడ II-టౌన్ ఇన్‌స్పెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డిని, కోర్టులో కేసును బలమైన వాదనలతో నడిపిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్, సీఐ జె. సోమ నర్సయ్యను ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే డిసిఆర్బి సీఐ శ్రీను నాయక్, సిడిఓ బుర్రి అఖిల్, డి. రాగ్యా నాయక్, లైజన్ అధికారులు పి. నరేందర్, ఎన్. మల్లికార్జున్‌లను ప్రశంసించారు.
నేరస్థులపై కఠిన చర్యలు... ఎస్పీ
మహిళలు, మైనర్ బాలికలపై అరాచకాలకు ఒడిగట్టే వారి పట్ల నల్గొండ జిల్లా పోలీస్ శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా, నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా దర్యాప్తు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి