అభివృద్ధి పనుల హామీ ఏమైంది.?
అభివృద్ధి పనుల హామీ ఏమైంది.?
NM Yadav
మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు పిల్లి రామరాజు..
పరిష్కరించకుంటే మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరిక..
నల్గొండ : నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని 3వ డివిజన్ శేషమ్మగూడెం పాతపల్లెలో పేరుకుపోయిన స్థానిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే పిల్లి రామరాజు యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన స్థానిక నాయకులతో కలిసి మున్సిపల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
అంతకుముందు ఆయన 3వ డివిజన్ పరిధిలోని పాతపల్లె గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామరాజు మాట్లాడుతూ.. పాతపల్లెలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా నిరుపయోగంగా మారిందని మురుగునీరు రోడ్డుపై పారుతుండటంతో శేషమ్మగూడెం, తానేధర్ పల్లి వైపు వెళ్లే ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వల్ప వర్షానికే ప్రధాన రహదారి జలమయమవుతోందని పేర్కొన్నారు. స్థానిక సమస్యలను పట్టించుకోవడంలో యంత్రాంగంతో పాటు నియోజకవర్గ ప్రజాప్రతినిధి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని రామరాజు విమర్శించారు.
తానేధర్ పల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్నారని, గెలిచిన తర్వాత కనీసం గ్రామాల వైపు చూడటం లేదని ఆరోపించారు. హైదరాబాద్, క్యాంపు కార్యాలయాలకే పరిమితమై ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. పాతపల్లెలో వెంటనే కొత్త డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే స్థానిక ప్రజలతో కలిసి మంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉండి పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ 3వ డివిజన్ ఇన్‌ఛార్జ్ శరత్, పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి