వెల్ఫేర్ బోర్డు నిధులు కార్మికుల కోసమే.. ప్రైవేట్ కంపెనీలకు కాదు..!
వెల్ఫేర్ బోర్డు నిధులు కార్మికుల కోసమే.. ప్రైవేట్ కంపెనీలకు కాదు..!
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
జీవో నెం.12ను వెంటనే రద్దు చేయాలి – సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్మాణ కార్మికుల భారీ ర్యాలీ, ధర్నా
లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, పెండింగ్ సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన వెల్ఫేర్ బోర్డు నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు మళ్లించడం తక్షణమే నిలిపివేయాలని, ఇందుకు సంబంధించిన జీవో నెం.12ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి ఎం.డి. సలీం డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలను యథావిధిగా కార్మికులకే అందించాలని, లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నల్లగొండలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. సుందరయ్య సెంట్రింగ్ కార్యాలయం నుంచి డీసీఎల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నిర్మాణ రంగ కార్మికులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన ఎం.డి. సలీం మాట్లాడుతూ, ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి వెల్ఫేర్ బోర్డు నిధులను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తోందని విమర్శించారు. ప్రమాద మరణం, సహజ మరణం, శాశ్వత అంగవైకల్యం, పాక్షిక అంగవైకల్యం వంటి కీలక సంక్షేమ పథకాలను జీవో నెం.12 ద్వారా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు బదిలీ చేయడం కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు.
జీవో ప్రకారం రూ.346.36 కోట్లను క్రెడిట్ యాక్సిస్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కేటాయించడం ప్రజాపాలనకు నిదర్శనం కాదని ఆయన విమర్శించారు. కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిధులు పూర్తిగా కార్మికుల సంక్షేమానికే వినియోగించాలని, సహజ మరణానికి రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, సీఎస్‌సీ హెల్త్ టెస్టుల పేరుతో అమలవుతున్న విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
నిర్మాణ రంగ కార్మికుల కష్టార్జిత సంపదతో కూడిన వెల్ఫేర్ బోర్డు నిధులను అవసరం ఉన్నా లేకున్నా ప్రతి కార్మికుడి పేరిట రూ.2,309 ప్రీమియం చెల్లిస్తూ ప్రైవేట్ కంపెనీలకు మళ్లించడం అన్యాయమని ఆయన అన్నారు. ఇప్పటికే సీఎస్‌సీ హెల్త్ చెకప్ పేరుతో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, కానీ కార్మికులకు చెల్లించాల్సిన నష్టపరిహారాలు వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని నిర్మాణ రంగ కార్మికులందరికీ హెల్త్ కార్డులు జారీ చేయాలని, గడువు ముగిసిన 13 లక్షల కార్మికుల కార్డులను వెంటనే రెన్యువల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డు నిర్వీర్యం చేసే చర్యలను ప్రభుత్వం కొనసాగిస్తే రాష్ట్రవ్యాప్తంగా కార్మికులను సమీకరించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ ధర్నాలో పాల్గొన్న ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి చిన్నపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 28 లక్షల మంది నిర్మాణ కార్మికులు వెల్ఫేర్ బోర్డులో నమోదై ఉండగా, కేవలం 15 లక్షల కార్డులనే పునరుద్ధరించడం వల్ల మిగిలిన 13 లక్షల మంది కార్మికులు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 55 సంవత్సరాలు పైబడిన నిర్మాణ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని, వారి పిల్లలకు విద్యా స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయాలని, పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే హైదరాబాద్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు కంచి కేశవులు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దండంపల్లి సత్తయ్య, జిల్లా సహాయ కార్యదర్శి పెంజర్ల సైదులు, ఏర్పుల యాదయ్య, అవుట రవీందర్, ఎస్. సైదాచారి, పోలె సత్యనారాయణ, బి. దయానంద్, వరికుప్పల ముత్యాలు, వడ్డేపల్లి శంకర్, బి. సైదులు, రేవెల్లి యాదయ్య, మంద రాజు, ఎస్.కె. హుస్సేన్, గోవిందు వెంకన్నతో పాటు వివిధ నిర్మాణ రంగ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే జీవో నెం.12ను రద్దు చేసి, వెల్ఫేర్ బోర్డు నిధులను కార్మికుల సంక్షేమానికే వినియోగించాలని వారు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి