'సూపర్ ఎల్ నినో' ప్రమాద ఘంటికలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రులు ఉత్తమ్, వెంకటరెడ్డి, లక్ష్మణ్‌కుమార్
'సూపర్ ఎల్ నినో' ప్రమాద ఘంటికలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రులు ఉత్తమ్, వెంకటరెడ్డి, లక్ష్మణ్‌కుమార్
NM Yadav
వరి బదులు ఆరుతడి పంటలే శ్రేయస్కరం ప్రాజెక్టుల్లో నీళ్లు తాగునీటికే ప్రాధాన్యం...
రైతులను చైతన్యపరచాలి పంట మార్పిడిపై క్షేత్రస్థాయికి అధికారులు...
ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాజెక్టులన్నీ ఇదే హయాంలో పూర్తి చేస్తాం ప్రభుత్వం స్పష్టం..
నల్గొండ : ‘ఎల్ నినో’ ప్రభావంతో రాబోయే రోజుల్లో తాగునీరు, విద్యుత్తు, వ్యవసాయ రంగాల్లో ఎదురయ్యే తీవ్ర సవాళ్లను తట్టుకునేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్‌ఛార్జి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్‌కుమార్ పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వం, యంత్రాంగంపై ఉందన్నారు. సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని ఉదయాదిత్య భవన్‌లో ఎల్ నినో సంసిద్ధత, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహంపై నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
"రైతులు వరి సాగుకు స్వస్తి చెప్పి, ఆరుతడి పంటలు, పంట మార్పిడి వైపు మళ్లేలా విస్తృత అవగాహన కల్పించాలి. ప్రస్తుతం ఉన్న పంటలను కాపాడుతూనే, వర్షపాతం వివరాలను ఎప్పటికప్పుడు రైతులకు చేరవేయాలి. సాగునీటి కోసం కొత్తగా బోర్లు వేయకుండా నియంత్రిస్తూ, తాగునీటికే ప్రథమ ప్రాధాన్యమివ్వాలి" అని నిర్దేశించారు.
వరి వేసి ఇబ్బంది పడొద్దు..మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం చూపుతున్న ‘సూపర్ ఎల్ నినో’ దృష్ట్యా రైతులు ఈ సీజన్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టులలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున, బోర్లు వేసుకున్నా చివరివరకు నీరందే అవకాశం లేదన్నారు. ప్రస్తుత నీటి నిల్వలు కేవలం తాగునీటి అవసరాలకే సరిపోతాయని, వర్షాలు కురవకపోతే వచ్చే జూలై నాటికి తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో జిల్లా ప్రాజెక్టులపై స్పందిస్తూ.. "ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఎస్ఎల్‌బీసీ, డిండితో పాటు నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను ఈ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేస్తాం. దేవాదుల ఫేజ్-6 ద్వారా తుంగతుర్తికి గోదావరి జలాలు అందిస్తాం. డిండి, దున్నపోతుల గండి, బస్వాపూర్ పనులను వేగవంతం చేస్తాం" అని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులపై రూపొందించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించారు.
ప్రజలు అధైర్యపడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుంది...మంత్రి వెంకటరెడ్డి
రాష్ట్ర రోడ్లు-భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కరువు పరిస్థితులు ఎదురైనా ప్రజలు అధైర్యపడాల్సిన పనిలేదని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఎస్ఎల్‌బీసీలో ఇప్పటికే 600 మీటర్ల టన్నెల్ పని పూర్తయిందని, ఆగస్టు 2028 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. తాగునీటి అవసరాల కోసం ఉదయసముద్రంలో నీటిని నింపాలని, మూసి నుంచి తిప్పర్తి మండలానికి సాగునీరు విడుదల చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. దేవరకొండ పరిధిలోని మూడు మండలాల్లో మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని మిషన్ భగీరథ అధికారులకు స్పష్టం చేశారు. ఇప్పటికే నాట్లు వేసుకున్న రైతులకు కరెంటు సమస్య రాకుండా అదనపు విద్యుత్ లోడ్ ప్రతిపాదనలు పంపాలని, ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలు లేకుండా చూడాలని సూచించారు.
సమావేశంలో ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులు..
బీర్లు ఐలయ్య (ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే): బస్వాపూర్, మల్లన్నసాగర్ భూసేకరణకు ₹87 కోట్లు విడుదల చేస్తే గంధమళ్ళ పూర్తవుతుందని, శామీర్‌పేట వద్ద నిలిచిపోయిన 5 కి.మీ పనులను వెంటనే పూర్తి చేయించి భువనగిరి, ఆలేరులకు నీరు తెప్పించాలని కోరారు. మందుల సామేలు (తుంగతుర్తి ఎమ్మెల్యే): బునియదిగాని కాలువ భూసేకరణకు నిధులు, తాగునీటి బోర్ల తవ్వకానికి ప్రత్యేక బడ్జెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
కుందూరు జైవీర్ రెడ్డి (నాగార్జునసాగర్ ఎమ్మెల్యే): సాగర్ పరిధిలో ఆరుతడి పంటలు వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నా కోతుల బెడద ఎక్కువగా ఉందని, ఆ సమస్యను తీర్చి, లిఫ్ట్‌లు, చెరువు కట్టల మరమ్మతులు చేపట్టాలన్నారు.
పద్మావతి రెడ్డి (కోదాడ ఎమ్మెల్యే): భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు, ఊటకుంటల నిర్మాణాలు చేపట్టాలని కోరారు.
బాలు నాయక్ (దేవరకొండ ఎమ్మెల్యే): డిండి నుంచి తాగునీటికి లింకేజీ ఏర్పాటు చేయాలని, నియోజకవర్గానికి 132 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు చేయాలన్నారు.
గుంటకండ్ల జగదీష్‌రెడ్డి (సూర్యాపేట ఎమ్మెల్యే): సూర్యాపేట పట్టణానికి తాగునీటి ఎద్దడి రాకుండా ప్రతిరోజూ నిర్దేశిత పరిమాణంలో మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలని కోరారు.
నెల్లికంటి సత్యం (ఎమ్మెల్సీ): పత్తి రైతులకు మద్దతుగా నిలవాలని, మునుగోడులో మిషన్ భగీరథ సరఫరాను సరిదిద్దడంతో పాటు డీడీలు కట్టిన రైతులకు వెంటనే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఎల్ నినో పరిస్థితులు, ముందస్తు ప్రణాళికలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమీక్షలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'తెలంగాణ జలసిరి' గోడపత్రికను మంత్రులు ఆవిష్కరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి